సముద్రగర్భంలో పెళ్లి, తమిళనాడులో వినూత్న వేడుక

సముద్రగర్భంలో పెళ్లి, తమిళనాడులో వినూత్న వేడుక

తమ కూతురికో, కొడుకుకో పెళ్లి నిశ్చయమైన వెంటనే చాలా ఘనంగా చేయాలని పరితపిస్తుంటారు ఇరు కుటుంబాల పెద్దలు. వధూవరులూ అలానే భావిస్తారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంతటి పీట ఇలా సినిమా సీన్లనూ ఊహించేసుకుంటుంటారు. కానీ.. తమిళనాడుకు చెందిన వధూవరులు వినూత్నంగా మనువాడారు. సముద్రగర్భంలో ఒక్కటయ్యారు. మన దేశంలో ఈ తరహా పెళ్లాడిన జంటగా రికార్డులకెక్కారు. అందరూ పెళ్లి చేసుకున్నట్లు తాము కూడా పెళ్లి చేసుకుంటే ఏం థ్రిల్‌ అనుకున్నది వీరిద్దరే. సముద్రజలాల్లో 60 అడుగుల లోతుకు దిగి అక్కడ పెళ్లాడారు. ఇంతవరకు ఈ తరహా మ్యారేజ్‌లు అరుదుగా విదేశాల్లో మాత్రమే చూశాం. కానీ మనదేశంలో ఇలా జరగడం ఇదే ప్రథమం కాబోలు.

జిహ్వకో రుచి… పుర్రెకో బుద్ది కోవలోకి వస్తాడు తమిళనాడులోని తిరువన్నామలైకి చెందిన చిన్నదురై. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌గా జాబ్‌ చేస్తున్న ఇతగాడికి…కోయంబత్తూర్‌కు చెందిన శ్వేతతో పెళ్లి నిశ్చయమైన వెంటనే ఓ ఆలోచన వచ్చింది. పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేసుకుంటామనేది ముఖ్యం కాదు, ఎంత వినూత్నంగా చేసుకుంటామనేదే ముఖ్యమని భావించి.. యూట్యూబ్‌లో తెగ సెర్చ్‌ చేశాడు. చివరకు సముద్రగర్భంలో పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందని భావించి…తన మనసులో మాటను పెళ్లి కుమార్తెకు చెప్పాడు. కాబోయే భర్త ఆలోచనకు ఫిదా అయిన శ్వేత వెంటనే ఓకే చెప్పడంతో ఇక వెనుకడుగు వేయలేదు. ఇద్దరూ పెద్దలకు విషయం చెప్పి ఒప్పించారు. తర్వాత పాండిచేరికి డీప్‌ సీ స్విమ్మింగ్‌ కోచ్‌ అరవిందను కలిసి తమ కోరిక చెప్పారు.

స్విమ్మింగ్‌ కోచ్‌ ఓకే అనడమే కాదు, పూర్తి భరోసా ఇవ్వడంతో.. ముందస్తు సన్నాహాలు జరిగిపోయాయి. తొలుత ఇద్దరూ స్విమ్మింగ్‌లో శిక్షణ పొందారు. కొన్ని రోజులకు స్విమ్మింగ్‌లో రాటుదేలాక పెళ్లికి సిద్ధపడ్డారు. అనుకున్న ముహుర్తానికి చెన్నై సమీపంలోని నీలాంగర్‌ బీచ్‌ సముద్రగర్భంలో చిన్నపాటి పెళ్లి వేదిక సిద్ధమైపోయింది. ఆక్సిజన్‌ సిలిండర్లను తగిలించుకుని… కోచ్‌ అరవింద్‌, మరో ముగ్గురు గజ ఈతగాళ్ల సాయంతో పడవలో సముద్రం మధ్యలోకి వెళ్లారు. అక్కడ సముద్రంలోకి దిగి ఈతకొడుతూ 60 అడుగుల లోతుకు దిగారు. క్షణం ఆలస్యం చేయకుండా… పూలదండలు మార్చుకున్నారు. వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. హిందూ సంప్రదాయం జరిగిన ఈ పెళ్లితంతును కొన్ని నిమిషాల్లోనే ముగించుకుని ఒడ్డుకు వచ్చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రులు, కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు.