ఎన్ 95 మాస్కులపై నిషేధం, కారణం ఇదే

  • Published By: naveen ,Published On : August 15, 2020 / 02:21 PM IST
ఎన్ 95 మాస్కులపై నిషేధం, కారణం ఇదే

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్వ్డ్ రెస్పిరేటర్స్ కలిగి ఉన్న ఎన్ 95 మాస్కుల వినియోగంపై నిషేధం విధించారు. బహిరంగ ప్రదేశాల్లో వాటిని వాడకుండా నిషేధిస్తూ ఇండోర్ జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్ 95 మాస్కులే కాదు వాల్వ్ లు కలిగున్న మాస్కులేవీ ధరించకూడదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.



వాల్వ్స్ ఉన్న మాస్కులు ధరిస్తే జరిమానా:
ఎన్95 సహా వాల్వ్‌లు కలిగిన అన్ని తరహా మాస్కుల వాడకం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కష్టమవుతుందంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొన్ని రోజుల క్రితం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో వీటి వాడకాన్ని నిషేధించారు. ఎన్95 వాల్వ్ మాస్క్‌లతో పాటు వాల్వ్‌లు కలిగిన అన్ని మాస్క్‌ల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ఇండోర్ కలెక్టర్ మనీష్ సింగ్ తన ఆదేశాల్లో తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.100 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

మాస్కులపై నిషేధం, షాక్ లో వ్యాపారులు:
అయితే ఈ ఆదేశాలు ఆరోగ్య సిబ్బంది, వైద్య సిబ్బందికి వర్తించబోవని స్పష్టం చేశారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు శివారు పంచాయితీల్లోనూ ఈ ఆదేశాలను అమలు చేస్తారు. ఎన్95 మాస్క్‌లపై నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులను నియమించారు. ఎన్ 95 మాస్కులపై నిషేధం కెమిస్టులను షాక్ కి గురి చేసింది. ఇప్పటికే ఇండోర్ లో రూ.5కోట్ల విలువ చేసే ఎన్ 95 మాస్కులు విక్రయించారు. ఈ నిర్ణయం హోల్ సేల్, రిటైల్ కెమిస్టులను షాక్ కి గురి చేసింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎన్ 95 మాస్కులు ఆర్డర్ చేసి ఉన్నారు. రిటైల్ వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయల విలువ చేసే వాల్వ్డ్ ఎన్ 95 మాస్కులు స్టాక్ ఉన్నాయి.



రూ.5కోట్లు నష్టం:
70 మంది హోల్ సేల్ కెమిస్టులు.. 500 మంది రిటైల్ కెమిస్టులు ఉన్నారు. సుమారు రూ.5కోట్ల విలువ చేసే వాల్వ్డ్ ఎన్95 మాస్కులు స్టాక్ లో ఉన్నాయి. కలెక్టర్ ఆదేశాలు వారికి భారీ నష్టాన్ని కలగజేస్తాయి అని ఇండోర్ కెమిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినయ్ వాపోయారు. హెల్త్ వర్కర్స్ కోసం అధికారులు తమ దగ్గర స్టాక్ లో ఉన్న మాస్కులను కొనుగులో చేసి కెమిస్టులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఆదేశాలు ఇచ్చే ముందు అధికారులు వ్యాపారులను హెచ్చరించాల్సి ఉంది. ముందే అప్రమత్తం చేసి ఉంటే కొత్త స్టాక్ కొనకుండా ఉండేవారని చెప్పారు.

వాల్వ్డ్ మాస్కులు కరోనా వ్యాప్తిని కట్టడి చేయలేవు:
వాల్వ్స్ ఉన్న ఎన్ 95 మాస్కులతో ప్రయోజనం లేదని, అవి కరోనాను కట్టడి చేయలేవని ఇటీవలే కేంద్రం స్పష్టం చేసింది. కాటన్ తో తయారు చేసిన మాస్కులు ధరించడం ఉత్తమం అని చెప్పింది. ఒకవేళ్ల ఇంట్లోనే తయారు చేసుకున్నవి అయితే.. అవి ముక్కు, నోరుని పూర్తిగా కవర్ చేసేలా చూసుకోవాలని కేంద్రం సూచించింది.



ఇంట్లో తయారు చేసిన మాస్కులే ఉత్తమం:
ఇంట్లో తయారు చేసిన మాస్కులను వాడాలని గతంలోనే ప్రభుత్వం ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి రోజు మాస్కులను శుభ్రం చేసుకోవాలని, వేడి నేటిలో కనీసం 5 నిమిషాల పాటు ఉంచి ఆరబెట్టాలని సూచించింది. మాస్కు ముఖాన్ని సరిగ్గా కవర్‌ చేసే విధంగా ఉండాలని.. అలాగే మాస్కుకు ఇరువైపులా ఖాళీలు లేకుండా చూసుకోవాలని కోరింది. అలాగే ఒకరి మాస్కు ఇంకొకరు ధరించకూడదని కూడా తెలిపింది.