Covid Deaths : హృదయవిదారక దృశ్యాలు..కుటుంబసభ్యుల కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్న కొవిడ్‌ రోగులు

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆస్పత్రుల దగ్గర కనిపించే దృశ్యాలు కలచివేస్తున్నాయి. కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయతతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Covid Deaths : హృదయవిదారక దృశ్యాలు..కుటుంబసభ్యుల కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్న కొవిడ్‌ రోగులు

Massive Covid Deaths In India

Massive Covid deaths in India : దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆస్పత్రుల దగ్గర కనిపించే దృశ్యాలు కలచివేస్తున్నాయి. కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయతతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ హృదయవిదారకంగా దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వైద్యం అందక ప్రాణాలు పోతుంటే ఏం చేయలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు బతికుండగానే నరకం అనుభవిస్తున్నారు.

కొవిడ్‌ మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. స్మశానాలన్నీ శవాల దిబ్బలుగా మారుతున్నాయి. దేశంలో సెకండ్ వేవ్‌ ముప్పు తీవ్రంగా ఉంది. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కుటుంబ సభ్యుల కళ్ల ముందే చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అన్నీ ఉన్నా… ఏమి చేయలేని పరిస్థితిలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా శవాల గుట్టలు దర్శనమిస్తున్నాయి.

మహారాష్ట్ర, ఢిల్లీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో సరిపడా పడకల్లేక, ఆక్సిజన్‌ కొరతతో సకాలంలో వైద్యం అందక కొవిడ్‌ రోగులు వందల సంఖ్యలో మరణిస్తున్నారు. ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రి వద్ద గుండెల్ని పిండేసే ఘటన చోటుచేసుకుంది. అస్లాంఖాన్‌ అనే వ్యక్తి కరోనా సోకిన తన భార్య రుబీఖాన్‌ను బైక్‌పై ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లినా చేర్చుకోలేదు. దీంతో ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి వచ్చాడు. తీవ్రంగా అలసిపోయిన అస్లాం నిస్సహాయతతో ‘నా భార్య చచ్చిపోతోంది.. దయచేసి ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోండి’ అంటూ ఆస్పత్రి సిబ్బందిని ప్రాధేయపడిన దృశ్యాలు అక్కడున్నవారిని కలచివేశాయి.

మహారాష్ట్రలో కరోనా రోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రాణవాయువే కాదు.. కనీస వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. నాసిక్‌ జిల్లా చాంద్వాడ్‌లో మరో హృదయవిదారక ఘటన జరిగింది. కరోనా సోకిన అరుణ్‌ మాలి అనే వ్యక్తిని అతడి భార్య ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది. ఆస్పత్రిలో పడకలు లేవని సిబ్బంది చేర్చుకోలేదు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కావడంతో కనీసం ఆక్సిజన్‌ అయినా పెట్టాలని భార్య వేడుకుంది. వైద్య సిబ్బంది స్పందించేలోపే అరుణ్‌.. తన భార్య ఒడిలోనే కన్నుమూశాడు. మరో సంఘటనలో భార్య ముందే ఓ భర్త ఊపిరి తీసుకోలేక మరణించాడు. చూస్తూ చూస్తుండగానే ఆ వ్యక్తి అలా కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేశాడు.

ఢిల్లీలో వైరస్‌ తీవ్రత పెరగడంతో అక్కడి ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య ఎక్కువవుతోంది. ఆక్సిజన్‌ కొరతతో అక్కడి చిన్న ఆసుపత్రులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. తాజాగా నగరంలోని శాంతి ముకుంద్‌ ఆసుపత్రిలోనూ ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. రోగుల ప్రాణాలు రక్షించాలని ఉన్నప్పటికీ ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడిందని ఆసుపత్రి సీఈఓ మీడియాకు వెల్లడిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఇది చాలా దురదృష్టకర, దుర్భరమైన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో చాలా ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారాయి. గుట్టలుగా మృతదేహాలు పడి ఉంటున్నాయి. అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశాన వాటికల్లో స్థలం సరిపోని పరిస్థితి నెలకొంది. గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.