ఏటీఎంను టచ్ చేయకుండానే క్యాష్ విత్‌డ్రా, మాస్టర్ కార్డ్ కొత్త టెక్నాలజీ

ఏటీఎంను టచ్ చేయకుండానే క్యాష్ విత్‌డ్రా, మాస్టర్ కార్డ్ కొత్త టెక్నాలజీ

contactless cash withdrawals at ATMs: క‌రోనా మ‌హమ్మారి కారణంగా పరిస్థితులు పూర్తిగా మారాయి. దేన్ని టచ్ చేయాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. ఏటీఎంలు ఇందుకు మినహాయింపు కాదు. ఏటీఎంకి వెళ్లి డబ్బు డ్రా చేయాలంటే చాలామంది భయపడ్డారు. ఈ క్రమంలో చాలా బ్యాంకులు ఏటీఎంను ముట్టుకోకుండానే డ‌బ్బు విత్‌డ్రా చేసుకునే అవ‌కాశాన్ని ప‌రిశీలించాయి. కానీ అది పూర్తిగా సాధ్యం కాలేదు. ఇప్పుడు మాస్ట‌ర్‌కార్డ్ మాత్రం ఓ అడుగు ముందుకేసింది. ఏజీఎస్ ట్రాన్‌స‌క్ట్ టెక్నాల‌జీస్‌తో క‌లిసి పూర్తి కాంటాక్ట్‌లెస్‌గా క్యాష్ విత్‌డ్రా చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది.

కాంటాక్ట్‌లెస్ విత్‌డ్రా విధానం:
దీనికోసం యూజ‌ర్లు త‌మ బ్యాంక్ మొబైల్ అప్లికేష‌న్ నుంచి ఏటీఎం స్క్రీన్‌పై క‌నిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఎంత డబ్బు కావాలన్న‌దానితోపాటు పిన్ నంబ‌ర్ కూడా యాప్‌లోనే ఎంట‌ర్ చేయాలి. ఆ వెంట‌నే ఏటీఎం నుంచి డ‌బ్బులు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

నిజానికి ఇప్ప‌టికే ఈ అవ‌కాశం ఉన్నా.. విత్‌డ్రా చేయాల్సిన డబ్బు కోస‌మైనా క‌స్ట‌మ‌ర్ ఏటీఎంను తాకాల్సి వ‌చ్చేద‌ని, తాము మాత్రం పూర్తి కాంటాక్ట్‌లెస్ ప‌రిష్కారాన్ని క‌నుగొన్న‌ట్లు ఏజీఎస్ గ్రూప్ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ మ‌హేష్ ప‌టేల్ తెలిపారు. మాస్ట‌ర్‌ కార్డ్ నెట్‌వ‌ర్క్ ఉప‌యోగించే బ్యాంకులు ఈ ఏజీఎస్ ట్రాన్‌స‌క్ట్ టెక్నాల‌జీ ద్వారా త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ అవకాశాన్ని అందించ‌వ‌చ్చు. ఈ క‌రోనా స‌మ‌యంలో ఇది బాగా ఉప‌యోగ‌ప‌డ‌టంతోపాటు ఏటీఎం ద‌గ్గ‌ర జ‌రిగే మోసాల‌ను కూడా త‌గ్గిస్తుంద‌ని మ‌హేష్ ప‌టేల్ చెప్పారు.

ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా నెలకు మూడుసార్లు కాంటాక్ట్ లెస్ క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చని మాస్టర్ కార్డు తెలిపింది. ఏజీఎస్‌టీటీఎల్ ఎండ్ టు ఎండ్ క్యాష్, డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ అండ్ ఆటోమేషన్ టెక్నాలజీ అందిస్తుంది. మాస్టర్ కార్డు.. పేమెంట్ ఇండస్ట్రీలో గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ.

కాంటాక్ట్ లెస్ టెక్నాలజీస్ పెంచడంలో క్యూఆర్ బేస్డ్ క్యాష్ విత్ డ్రా గేమ్ చేంజర్ కానుందని ఏజీఎస్ టీటీఎల్ చైర్మన్, ఎండీ రవి గోయల్ అన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు తమను తాము వైరస్ నుంచి కాపాడుకుంటూ క్యాష్ విత్ డ్రా చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని మాస్టర్ కార్డు సౌత్ ఆసియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వికాస్ వర్మ చెప్పారు. కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఏటీఎం పిన్ ప్యాడ్ ను తాకాల్సిన అవసరం లేకుండానే ఎంతో భద్రంగా, వేగంగా డబ్బుని విత్ డ్రా చేసుకోవచ్చన్నారు.