UP Election : శ్రీకృష్ణా..యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రం ఇదే!

ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్యాంపెయిన్ అంతా "మధుర"

UP Election : శ్రీకృష్ణా..యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రం ఇదే!

Mathura

Mathura :  ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్యాంపెయిన్ అంతా “మధుర”కేంద్రంగా ఉండవచ్చని ఆయన హింట్ ఇచ్చారు. శ్రీకృష్ణ జన్మస్థలం “మధుర”లో శ్రీకృష్ణుడు ఆలయ ప్రాంగణానికి ఆనుకొని ఉన్న షాహి ఈద్గా విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

అయితే ఇదే అంశాన్ని యూపీ బీజేపీ తన ఎన్నికల క్యాంపెయిన్ గా మార్చుకోనుందని పరోక్షంగా కేశవ్ ప్రసాద్ మౌర్య తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. “అయోధ్య కాశీలో ఒక గొప్ప ఆలయ నిర్మాణం జరుగుతోంది. మధుర కోసం సన్నాహాలు” అని మౌర్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు. జై శ్రీరామ్,జై శివ్ శంభో,జై శ్రీ రాధే కృష్ణ హ్యాష్ ట్యాగ్ లను ట్వీట్ లో జోడించారు. అయితే, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6కి కేవలం ఐదు రోజుల ముందు మౌర్య చేసిన ట్వీట్ ఇప్పుడు యూపీ రాజకీయాల్లో కీలకంగా మారింది.

మధుర మందిర్-మసీదు వివాదం
శ్రీకృష్ణ జన్మ భూమి వివాదం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. దీనిపై ఇప్పటికే అనేక ఘర్షణలు జరిగాయి. కానీ సమస్యకు ఓ పరిష్కారం మాత్రం రాలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలోని కత్రా కేశవ్ దేవ్ ఆలయ పరిధిలోని 13.37 ఎకరాల ప్రాంగణంలోనే శ్రీ కృష్ణుడి జన్మస్థలం ఉందని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 1669-70లో కృష్ణ ఆలయంలోని కొంత భాగాన్ని ధ్వంసం చేసి ఈ షాహీ ఈద్గా మసీదును నిర్మించారని, సదరు మసీదును వెంటనే తొలగించేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి 1968 అక్టోబర్‌లో శ్రీకృష్ణ జన్మభూమి వివాదం పరిష్కారం అయింది. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంఘం, షాహీ మసీదు ఇద్గా మధ్య రాజీ కుదిరింది. అయితే నాటి తీర్పులు కొట్టేయాలని, వివాదాస్పద స్థలంలో మసీదును తొలగించి, ఆ భూమినంత హిందువులకు అప్పగించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి. అయితే 1968లోనే రాజీ కుదరిందని,మళ్లీ ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తడంపై ముస్లిం సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

శ్రీకృష్ణుని జన్మస్థలంగా పరిగణించబడే మధురలోని కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న 17వ శతాబ్దానికి చెందిన షాహీ మసీదు ఈద్గాను తొలగించాలని స్థానిక కోర్టులతో పాటు సుప్రీంకోర్టులో కూడా అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే సమయంలో దేవుడి ‘అసలు జన్మస్థలం’ వద్ద శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని అఖిల భారత హిందూ మహాసభ, మసీదును “తొలగించాలని” డిమాండ్ చేస్తూ విశ్రామ్ ఘాట్ నుండి శ్రీకృష్ణ జన్మస్థాన్ వరకు మార్చ్‌ను చేపట్టనున్నట్టు నారాయణి సేన చేసిన ప్రకటనల తర్వాత మధుర జిల్లా యంత్రాంగం సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలను విధించింది.

ALSO READ International Flights : అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు