వధువు కావలెను : వాటితో పాటు దేశభక్తి ఉండాలి

  • Published By: chvmurthy ,Published On : February 18, 2020 / 09:06 AM IST
వధువు కావలెను : వాటితో పాటు దేశభక్తి ఉండాలి

ఆదివారం వచ్చిందంటే చాలు అన్ని భాషల్లోని దిన పత్రికలు సండే స్పెషల్స్ తో ఎక్కువ పేజీలు ముద్రిస్తాయి. వాటిలో కధలు, సినిమాలు, వారఫలాలు, ఇత్యాది వాటితో  పాటు పెళ్లి సంబంధాలకు కూడా ఒక పేజీ ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ఇక పెళ్లి సంబంధాల పేజీలో వధువు కావలెను. వరుడు కావలెను అనే సెక్షన్ లో ఎవరికి వారు, వారికి కావల్సిన వధూవరుల కోసం వెతుకులాట మొదలెడతారు. 

వధువు కావలెను అంటూ ఇచ్చే ప్రకటనల్లో కావాల్సిన కులం, గోత్రం, చదువు, హైట్, ఉద్యోగం, సాంప్రదాయం వంటి వాటిని  పేర్కోంటూ ఆ లక్షణాలు గల యువతిని కోరుకుంటూ ఉంటారు.   బీహార్ కు చెందిన 31 ఏళ్ల బ్రాహ్మణ, దంత వైద్యుడు. అభినవ్ కుమార్ తాను పెళ్లి చేసుకోటానికి ఇచ్చిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ ఎందుకవుతుంది, ఎవరి కోరికలు వారికుంటాయంటారా…….అదేం కాదు…అతని  కోరికల చిట్టా చూసి అందరూ ముక్కున  వేలేసుకుంటున్నారు. ఏంటా కోరికలు అంటారా……చదవండి మీకే తెలుస్తుంది.
 

సదరు వరుడు  ప్రస్తుతం ఏమీ ఉద్యోగం చేయటంలేదు కానీ…ఈయనకు ఉద్యోగం చేసే వధువు కావలెను. అదీ బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన అమ్మాయి కావాలిట. అదీ కాక  అందంగా ఉండాలి …సరసంగా ఉండాలి…భర్త పట్ల ప్రేమ శ్రధ్ద కలిగి ఉండాలి, ధైర్యం, శక్తి కలిగి ధనిక కుటుంబానికి చెందినదై ఉండాలిట. ఇప్పటికే అతడు కోరుకున్న అర్హతలు కలిగిన వధువు దొరకటం కష్టం… ఇవి కాక కొన్ని ప్రత్యేక లక్షణాలు హైలైట్ చేశాడు. 
 

అత్యంత దేశభక్తి కలిగి ఉండి భారత దేశ సైనిక, మరియు క్రీడా సామర్ధ్యాలను పెంచాలనే  కోరిక కూడా ఆమెలో ఉండాలని…క్యాపిటల్ లెటర్స్ తో, బోల్డు లెటర్స్ లో హైలైట్ చేస్తూ ప్రకటన ఇచ్చాడు. 
 

ఇక్కడితో కోరికల చిట్టాఅయిపోలేదు…. ఆమె ఆధునిక భావజాలం కలిగి ఉండాలి కానీ దయగలదై ఉండాలి… పిల్లలను పెంచడంలో నేర్పు కలిగి ఉండాలని కోరుకున్నాడు. ఇంకా…రుచికరంగా వంట చేయగలిగి ఉండాలిట..వాటితో పాటు జార్ఖండ్, బీహార్ లకు  చెందిన బ్రాహ్మణ కుటుంబానికి  చెందిన వధువు కావాలని అడిగాడు. ఇంకో ముఖ్య విషయం ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా  ఇరువురు జాతకాలు కలవాలిట. వధూవర గుణ మేళన చక్రంలో 36 పాయింట్లు తప్పని సరిగా రావాలనే కండీషన్ కూడా పెట్టాడు.
 

సరే… ఇవన్నీ కుదిరితే అబ్బాయి గారు అమ్మాయి తరుఫు వారితో నేరుగా మాట్లాడతాడా అంటే మాట్లాడరుట… తాను వివాహం కోసం తొందర పడటంలేదు కాబట్టి తాను కోరిన కోరికలు…అర్హతలు ఉన్న వధువు  అతగాడికి ఎస్సెమ్మెస్ చేయాలని చెపుతూ 8521144946 అనే ఫోన్ నెంబరు ఇచ్చాడు. లేదా…. abhinavakumar21@rediffmail.com కు ఈ మెయిల్ చేయాలిట. 
 

ఏ పేపర్లో ఈ ప్రకటన ఇచ్చాడో తెలీదు కానీ  ఇప్పుడు ఈ  పేపరు కటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తనదైన శైలిలో  కామెంట్లు పెడుతున్నారు.