కమల్ నాథ్ సర్కార్ కు మాయా వార్నింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : April 30, 2019 / 03:06 PM IST
కమల్ నాథ్ సర్కార్ కు మాయా వార్నింగ్

కాంగ్రెస్ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాయా ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంలో బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదన్నారు మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును సమీక్షిస్తామని మాయావతి హెచ్చరికలు చేశారు. గుణ బీఎస్పీ అభ్యర్థిని ఎన్నికల రేసు నుంచి బలవంతంగా కాంగ్రెస్ తప్పించిందని, దీనికి తమ పార్టీ గట్టి సమాధానం ఇస్తుందని మాయా అన్నారు. గుణ లోక్ సభ బీఎస్పీ-ఎస్పీ కూటమి అభ్యర్థి లోకేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఎన్నికల రేసు నుంచి తప్పుకుని కాంగ్రెస్‌ లో చేరిన సందర్భంగా మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.
సోమవారం లోకేంద్ర సింగ్ కాంగ్రెస్‌ లో చేరడంతో పాటు గుణ సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతు ప్రకటించారు.కాంగ్రెస్ ఫ్యామిలీలోకి లోకేంద్రసింగ్ ను ఆహ్వానిస్తున్నామని సింధియా అన్నారు.ఆరో విడతలో భాగంగా మే- 12,2019న గుణలో పోలింగ్ జరుగనుంది.

2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230స్థానాలకు గాను కాంగ్రెస్ 114 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది.బీజేపీ 109 సీట్లకు పరిమితమైంది.అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 116మంది ఎమ్మెల్యేల అవసరం ఉండటంతో బీఎస్పీ చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు,ఎస్పీకి చెందిన ఒక ఎమ్మెల్యే, నలుగురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు.దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.