బీజేపీలో చేరిన తృణముల్ నేత…తప్పు చేశానంటూ స్టేజీ మీదే గుంజిళ్లు

బీజేపీలో చేరిన తృణముల్ నేత…తప్పు చేశానంటూ స్టేజీ మీదే గుంజిళ్లు

WEST BENGAL ఎనిమిది విడతల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ..మరోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో పాగా వేయడం కోసం బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరిట టీఎంసీ నాయకులను లాక్కుంటుంది. పెద్ద సంఖ్యలో టీఎంసీ నేతలు ఇప్పటికే కాషాయకండువా కప్పుకున్నారు.

అయితే తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్ నాయుకుడు సుశాంత్‌ పాల్‌ బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితం టీఎంసీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఇవాళ టీఎంసీ మాజీ మినిస్టర్‌ సువేందు అధికారి, రాష్ట్ర బీజేపీ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా సుశాంత్‌ పాల్‌ మాట్లాడుతూ..మొదట నేను బీజేపీలోనే ఉన్నాను. కానీ లెఫ్ట్‌ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం 2005లో టీఎంసీలో చేరాను. అప్పటి నుంచి ఆ పార్టీలో ఉండి తప్పు చేశాను. టీఎంసీ కార్యకర్తగా నాకు అంటుకున్న పాపాల ప్రక్షాళన కోసం నాకు నేనే ఓ చిన్న శిక్ష వేసుకుంటున్నాను అంటూ స్టేజీమీదే మూడు సార్లు గుంజిళ్లు తీశారు. పక్కన ఉన్న వారు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ పాల్‌ మాత్రం ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.