ఈ స్వీట్ డిస్కషన్ వెరీ హాట్ : తమిళనాడు-కర్నాటక మధ్య చిచ్చుపెట్టిన మైసూర్ పాక్

  • Published By: vamsi ,Published On : September 17, 2019 / 10:27 AM IST
ఈ స్వీట్ డిస్కషన్ వెరీ హాట్ : తమిళనాడు-కర్నాటక మధ్య చిచ్చుపెట్టిన మైసూర్ పాక్

దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన స్వీట్.. మైసూరు పాక్.. ఈ స్వీట్ మాదంటే మాది అంటూ కన్నడిగులు, తమిళులు ఎప్పటి నుంచో ఫైటింగ్ చేస్తున్నారు. అసలు పేరులోనే మైసూరు ఉందని, అటువంటప్పుడు తమిళులు మైసూర్ పాక్ మాది అంటూ అనడం కరెక్ట్ కాదని కన్నడిగులు అంటున్నారు. ఈ క్రమంలో కన్నడిగులు, తమిళులు ఒకరిపై ఒకరు మండిపడుతుండగా.. ఆనంద్ రంగనాథన్ అనే కాలమిస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆ చర్చను మరోసారి లేవదీసింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఆనంద్ రంగరాజన్ చమత్కారంగా కొన్ని కామెంట్లు చేశారు. మైసూర్ పాక్ కు సంబందించిన భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ ను తమిళనాడుకు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు అని చెబుతూ ఆమెకు మైసూర్ పాక్ ఇస్తున్న ఫోటోను రంగరాజన్ విడుదల చేశారు.

దీంతో తమిళనాడు మీడియా చానెళ్లు, కన్నడ మీడియా చానెళ్లు.. ఈ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ అంటూ వేసేశాయి. దీంతో అసలు రచ్చ మొదలైంది.  మైసూర్ పాక్ కు భౌగోళిక గుర్తింపును కేంద్రం ఇచ్చిందంటూ బ్రేకింగ్ న్యూస్ వేయడంతో ఒక్కసారిగా కర్ణాటక, తమిళనాడులలో గోల మొదలైపోయింది.

ఆనంద్ రంగనాథన్ చమత్కరించిన ట్వీట్ ను తప్పుగా తీసుకుని వార్త ప్రసారం చేయడంతో గందరగోళం ఏర్పడింది. వాస్తవానికి భౌగోళిక గుర్తింపు మైసూర్ పాక్ కు సంబంధించి ఎవరికీ ఇవ్వలేదు. అయితే తప్పుగా న్యూస్ చానెళ్లు వార్తలు ప్రసారం చేయడంతో గందరగోళం చెలరేగింది.