రూ.7.38 కోట్ల ప్రైజ్ మనీ గెలిచిన ఇండియన్ స్కూల్ టీచర్

  • Published By: sreehari ,Published On : December 5, 2020 / 09:42 AM IST
రూ.7.38 కోట్ల ప్రైజ్ మనీ గెలిచిన ఇండియన్ స్కూల్ టీచర్

Ranjitsinh Disale winner Global Teacher Prize : బాలికా విద్య ప్రోత్సాహానికి కృషి చేసిన భారతీయ స్కూల్ టీచర్.. ఒక మిలియన్ డాలర్ల వార్షిక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020కు విజేతగా ఎంపికయ్యారు. మహారాష్ట్రకు చెందిన రంజిత్‌సిన్హ్ డిసాలే అనే ఉపాధ్యాయుడు 1 మిలియన్ డాలర్లు (రూ.7,38 కోట్లు) గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ అవార్డును గెలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 10మంది ఫైనలిస్టులతో పోటీపడిన డిసేల్ ఈ ఘనతను సాధించారు. తన ప్రైజ్‌ మనీలో 50 శాతాన్ని తోటిపోటీదారులతో కలిసి పంచుకుంటానని ప్రకటించి అందరికి ఆదర్శంగా నిలిచారు.



యునెస్కో భాగస్వామ్యంతో ఈ అవార్డును 2014లో వర్కీ ఫౌండేషన్ స్థాపించింది. పశ్చిమ భారతదేశంలోని గ్రామ పాఠశాలలోని పేద గిరిజన వర్గాలకు చెందిన బాలికలకు సహాయం చేసినందుకు ఈ ఏడాదిలో గ్లోబల్ టీచర్ ప్రైజ్ రంజిత్‌సిన్హ్ డిసేల్‌కు లభించింది. ప్రతి ఏడాదిలో గ్లోబల్ టీచర్ ప్రైజ్- 2020 అవార్డును అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ వృత్తికి విశేష కృషి చేసిన టీచర్‌ను గుర్తించి ఈ అవార్డును ప్రకటిస్తారు. గ్లోబల్ టీచర్ ప్రైజ్- 2020 విజేత ఈవెంట్‌ను వర్చువల్ విధానంలో నిర్వహించారు. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం నుంచి బ్రిటిష్ నటుడు స్టీఫెన్ ఫ్రై ఈ వేడుకను ప్రారంభించారు.



రంజిత్ 2009లో సోలాపూర్‌లోని పరితేవాడి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. అప్పటికి ఒక శిథిలమైన భవనంలో స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. అలాంటి స్కూల్‌ను రంజిత్ పూర్తిగా మార్చేశారు. విద్యార్థులకు స్థానిక భాషలో పాఠ్యపుస్తకాలు అందించారు. బుక్స్‌ను విద్యార్థుల మాతృభాషలోకి ట్రాన్స్‌లేషన్ చేసి ఇచ్చారు. ఆడియో, వీడియో లెసన్స్‌, కథలు, అసైన్‌మెంట్లను క్యూఆర్ కోడ్‌ ద్వారా యాక్సెస్ చేసుకునేలా డిజిటలైజేషన్ సౌకర్యాన్ని కల్పించారు. బాలికలను పాఠశాలలకు పంపేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఆ గ్రామంలో బాల్యవివాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆ పాఠశాలలో బాలికల హాజరు 100 శాతం ఉంటోంది.



రంజిత్‌ ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్‌ పద్దతిని మహారాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చాలా స్కూళ్లలో అందుబాటులోకి తీసుకోస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం 2017లోనే ప్రకటించింది. యుద్ధ ప్రభావానికి గురైన ప్రాంతాల్లో యువతకు పాఠాలు చెప్పేందుకు రంజిత్ “లెట్స్ క్రాస్ ది బోర్డర్స్” ప్రాజెక్టును ప్రారంభించారు. భారత్, పాకిస్థాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, యూఎస్, ఉత్తర కొరియా యువకులతో సమావేశాలు చేశారు. బాలికల విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ఆరు వారాల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎనిమిది దేశాల నుంచి 19,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.