హ్యాట్సాఫ్ మేడమ్, భారతదేశం మొదటి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న మహిళ ఈమే

  • Published By: veegamteam ,Published On : March 28, 2020 / 05:02 PM IST
హ్యాట్సాఫ్ మేడమ్, భారతదేశం మొదటి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న మహిళ ఈమే

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తోంది. వేల సంఖ్యలో ప్రజలను బలితీసుకుంది. ఇంకా కరోనా బారిన పడుతున్నవారి, చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచం ముందున్న ఏకైక లక్ష్యం కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడమే. కరోనా వెలుగులోకి వచ్చి 4 నెలలు అవుతున్నా, ఇంతవరకు దానికి మందు కనిపెట్టలేకపోయారు. ఆ దిశగా శాస్త్రవేత్తలు ముమ్మరంగా కృషి చేస్తూనే ఉన్నారు. ఇక మరో లక్ష్యం ఏంటంటే, నిమిషాల్లోనే కరోనా వైరస్  నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసే పరికరాన్ని కనుక్కోవడం. ప్రస్తుతం కరోనా వ్యాధి నిరార్ధణకు చాలా సమయం పడుతోంది. బాధితుడి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపాక రిపోర్టు రావడానికి చాలా సమయం పడుతోంది. దీంతో మరింత తొందరగా వ్యాధిని నిర్ధారించే వైద్య పరికరాల తయారీ దిశగా ప్రయత్నాలు జరుగతున్నాయి.

మన దేశంలోనూ కోవిడ్ టెస్టింగ్ కిట్ కు సంబంధించి డాక్టర్లు, సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పుణెకి చెందిన డయాగ్నస్టిక్ ఫర్మ్ సక్సెస్ సాధించింది. దేశంలోనే తొలి స్వదేశీ కోవిడ్ టెస్టింగ్ కిట్ డెవలప్ చేసింది. ఈ కిట్ ద్వారా స్వల్ప వ్యధిలోనే కరోనా వైరస్ నిర్ధారణ చేయొచ్చు.

దేశ ప్రయోజనాలే ముఖ్యం:
ఈ టెస్టింగ్ కిట్ తయారీ విషయంలో కొన్ని విమర్శలు ఉన్నా, మన దేశంలో తయారు చేసిన ఈ టెస్ట్ కిట్ దేశానికి అవసరమైన పురోగతి కావచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఈ కిట్ తయారీ వెనుక ఓ మహిళ శ్రమ, కష్టం ఉంది. ఇప్పుడా మహిళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఆమె గర్బిణి. కొన్ని గంటల్లో డెలివరీ కావాల్సి ఉంది. అయినా దేశ ప్రయోజనాలు, శ్రేయస్సు ముఖ్యం అంటూ టెస్టింగ్ కిట్ పై ప్రయోగాలు చేశారు.
ఆమె పేరు మినల్ దక్ వే భోస్లే(MINAL DAKHAVE BHOSALE). ఆమె వైరాలజిస్ట్. మైల్యాబ్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ చీఫ్. ఆమె ఆధ్వర్యంలోనే కరోనావైరస్ టెస్టింగ్ కిట్ ప్యాతో డిటెక్ట్ డెవలప్ చేశారు. కేవలం ఆరు వారాల్లో ఈ కోవిడ్ టెస్టింగ్ కిట్ డెవలప్ చేయడం విశేషం. 

కేవలం రెండున్నర గంటల్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష:
కాసేపట్లో ప్రసవించాల్సి ఉన్నా, ఆమె ఆసుపత్రికి వెళ్లకుండా నేరుగా ల్యాబ్ కి వచ్చారు. టెస్టింగ్ కిట్ పూర్తి చెయ్యడం అయ్యాకే ఆసుపత్రికి వెళ్లారు. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ”ఇది ఎమర్జెన్సీ. అందుకే సవాల్ గా తీసుకున్నా. నా దేశానికి నేను సేవ చేయాలనుకున్నా” అని భోస్లే చెబుతారు. మా బృందంలో 10 మంది ఉన్నాము, కోవిడ్ టెస్టింగ్ కిట్ తయారీకి ఎంతో తీవ్రంగా శ్రమించాము అని భోస్లే చెప్పారు. అంతిమంగా మార్చి 18న, తాము తయారు చేసిన టెస్టింగ్ కిట్ ను జాతీయ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ కు అందచేశామన్నారు. గురువారం నుంచి ఈ కిట్లు మార్కెట్ లోకి వచ్చాయి. మేము తయారు చేసిన కిట్ ద్వారా కేవలం రెండున్నర గంటల్లో కరోనా సోకిందా లేదా అనేది తెలుస్తుందన్నారు. దిగుమతి చేసుకున్న టెస్టింగ్ కిట్ ద్వారా ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుందన్నారు.

రోజుకు 15 వేలకు పైగా కోవిడ్ టెస్టింగ్ కిట్లు తయారీ:
కిట్ల తయారీకి మైల్యాబ్స్ డిస్కవరీ సొల్యూషన్స్ అధికారుల నుంచి చట్టబద్ధమైన ఆమోదం పొందింది. పుణెలోని లోనావాలాలో తయారీ పరిశ్రమ ఉంది. అక్కడ రోజుకు 15 వేలకు పైగా కోవిడ్ టెస్టింగ్ కిట్లు తయారు చేస్తున్నారు. మై ల్యాబ్స్ వాళ్లు ఫస్ట్ బ్యాచ్ లో తయారు చేసిన కిట్లను పుణె, ముంబై, ఢిల్లీ, గోవా, బెంగళూరులోని డయాగ్నస్టిక్ ల్యాబ్స్ కు పంపారు.