Beautiful Nohkalikai Water Fall : పచ్చని కొండల్లో అందాల జలపాతం వెనుక అంతులేని విషాదం ..

పచ్చని కొండల్లో అందాల జలపాతం వెనుక అంతులేని విషాదం ఉందని మీకు తెలుసా? ఈ జలపాతం అందాల వెనుక ఓ పిచ్చి తల్లి బిడ్డ కోసం పడిన వేదన ఉందని తెలుసా..?

Beautiful Nohkalikai Water Fall : పచ్చని కొండల్లో అందాల జలపాతం వెనుక అంతులేని విషాదం ..

breathtakingly beautiful Nohkalikai Falls

breathtakingly beautiful Nohkalikai Falls : ఉరికిపడే గంగను ఒడిసిపట్టిన గంగాధరుడి సంకల్పశక్తే ఈ భూమ్మీద గంగమ్మ ఉనికికి కారణం అంటారు. భూమికి గంగమ్మను తీసుకొచ్చిన భగీరథుడి కృషి..అత్యంత వేగంగా ఉరికిపడే  గంగమ్మను శివుడు తన జటాఝూటంలో ఒడిసిపట్టి ఈ భూమ్మీదకు వదిలాడట.  ఉరికిపడే గంగమ్మను చూడటానికి రెండు కళ్లు చాలవు. కొండల్లోంచి ఉరికిపడే గంగమ్మ జలపాతంలా మారి ఈ ప్రకృతిలో ఇమిడిపోయింది.మానవులను ఆనందపరుస్తోంది. జలపాతాలు ఆయా భౌగోళిక పరిస్థితులను బట్టి ఆ అందం ఉంటుంది. ఎతైన పచ్చని కొండల్లోంచి ఉరికిపడే జలపాతాలు మాత్రం మనస్సును ఎక్కడికో తీసుకుపోతాయి. మైమరిపిస్తాయి. ఓ రకమైన ఉద్వేగాన్ని కలిగిస్తాయి.  ఆ అందాల జలపాతల వెనుక ప్రకృతి మమేకమై ఉంటుంది. గాలి..పచ్చని చెట్లు..ఆయా ప్రాంతాన్ని బట్టి ఉన్న భౌగోళిక పరిస్థితులు ఇలా ఎన్నో జలపాతాల అందాలకు మరింత వన్నె తెస్తాయి. కానీ పచ్చని కొండల్లో అత్యంత ఎతైన ప్రాంతం నుంచి ఉరికిపడే ఓ జలపాతం వెనుక అత్యంత విషాదకరమైన కథ ఉంది అంటే మాత్రం ఆ అందాన్ని ఆస్వాదించలేం కదూ..అటువంటి ఓ అందాల జలపాతం వెనుక ఉన్న విషాధ గాథ గురించి తెలుసుకుందాం..

అది మేఘాలయలోని నోహ్కాలికై వాటర్ ఫాల్స్‌. ఈ జలపాతం భారత్ లోనే అతి ఎత్తైన ప్లంజ్ (plunge waterfall) జలపాతంగా గుర్తింపు పొందింది. ఆకుపచ్చని తివాచీ పరిచినట్లుగా ఉండే కొండలపై నుంచి ఉవ్వెత్తున ఉరికిపడే ఈ నోహ్కాలికై వాటర్ ఫాల్ వెనుక ఓ విషాద గాధ ఉంది. ఇది విషాధ గాధే కాదు అంత్యంత భయానకమైనది కూడా..ఈ నోహ్కాలికై వాటర్ ఫాల్ ను వీక్షించటానికి 90 శాతం మంది వెళుతుంటారు.

నోహ్కాలికై అనే మాట ఖాసీ భాషలోంచి వచ్చింది. ‘కా’ అనేది స్త్రీ లింగాన్ని సూచిస్తుంది. లికై అనేది ఒక స్త్రీ పేరు. స్థానిక పురాణాల ప్రకారంగా నోహ్కాలికై జలపాతానికి పైన ఓ గ్రామం వుంది. ఆ గ్రామం పేరు రంగ్జిర్తెహ్. ఆ గ్రామంలో లికై అనే మహిళ తన భర్త ఆడబిడ్డతో నివసించేది. కానీ ఆమె భర్త చనిపోయాడు. భర్త మరణం తరువాత లికై తన బిడ్డతో జీవిస్తుండేది. కానీ తన బిడ్డను చూసుకోవడానికి లికై కష్టపడేది. దాంతో ఆమె మరో వివాహం చేసుకుంది. కానీ రెండో భర్తకు మొదటి భర్త కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ పిల్లను ఎలాగైనా అడ్డుతప్పించాలని అనుకునేవాడు. సమయం కోసం వేచి చూసి ఓ రోజు భార్యకి తెలియకుండా ఆ బిడ్డను చంపేశాడు. ఆ బిడ్డ అవయవాలతో వంట వండి ఆ వంటను భార్యకు పెట్టాడు. నా భర్తకు నేనంటే ఎంత ఇష్టం నాకోసం వంట చేశాడని సంబరపడిపోయింది పిచ్చితల్లి. కానీ తన కూతురినే చంపేసి ఆ మాంసంతో వంట చేశాడని తెలుసుకోలేకపోయింది. పాప ఏదని భర్తని అడిగింది. దానికి అతను ఏదో చెప్పాడు. భర్త తనకోసం వంట చేశాడనే సంబరంలో ఆ వంటను తిన్నది.

మాంసం కూర తినేసి తమలపాకులు, వక్క వేసుకునేటప్పుడు ఆమెకి తమలపాకులు వేసుకునే చోటికి వెళ్ళాక అక్కడ ఒక చిన్న వేలు పడి ఉండటం చూసింది. ఆశ్చర్యపోయింది.భయపడింది. భర్తను నిలదీసింది. అసలు విషయం చెప్పాడు భర్త. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంతే మానసిక స్థితి అదుపు తప్పింది. పిచ్చిపట్టినట్లుగా ఊరంతా పరుగులు పెట్టింది. అలా పరుగు పెడుతూ చివరకు జలపాతం వద్దకు వెళ్లి ఆ జలపాతంలో పడిపోయింది. దాంతో ఆ జలపాతానికి ఆమె పేరు మీదనే నోహ్కాలికై అనే పేరు వచ్చిందట. ఇదంతా నిజంగా జరిగింది అని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా..స్థానికులు అదే ఇప్పటి నమ్ముతారు. ఇదే కథను చిన్న చిన్న మార్పులతో చెబుతుంటారు.