త్రివర్ణపతాకంపై ముఫ్తీ కామెంట్స్…పీడీపీకి ముగ్గురు నేతల రాజీనామా

  • Published By: venkaiahnaidu ,Published On : October 26, 2020 / 06:42 PM IST
త్రివర్ణపతాకంపై ముఫ్తీ కామెంట్స్…పీడీపీకి ముగ్గురు నేతల రాజీనామా

Mehbooba’s actions hurt patriotic sentiments త్రివర్ణపతాకం,ఆర్టికల్-370పై మూడు రోజులక్రితం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)చీఫ్ మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలోనే అగ్గిరాజేస్తున్నాయి. ముఫ్తీ వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ముగ్గురు పీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు.



పీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ముగ్గురు నేతలు తమ రాజీనామా లేఖలను మెహబూబా ముఫ్తీకి పంపారు. మెహబూబా ముఫ్తీ చేపట్టిన కొన్ని చర్యలు, ప్రత్యేకంగా దేశభక్తి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం తమకు చాలా అసౌకర్యంగా అనిపిస్తోందంటూ తమ రాజీనామా లేఖల్లో వారు పేర్కొన్నారు.



మరోవైపు, మెహ‌బూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్య‌లపై నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. జ‌మ్మూలోని పీడీపీ కార్యాల‌యం ఎదుట ఇవాళ బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు. పీడీపీ కార్యాల‌యంపై బీజేపీ కార్య‌క‌ర్త‌లు జాతీయ జెండా ఎగుర‌వేశారు. జై భార‌త్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీన‌గ‌ర్‌ క్లాక్ ట‌వ‌ర్ వ‌ద్ద జాతీయ జెండాను ఎగుర‌వేసేందుకు ముగ్గురు యువ‌కులు ప్ర‌య‌త్నించారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.



గతేడాది ఆగస్టులో ఆర్టికల్-370రద్దు సమయం నుంచి..సుమారు ఏడాది పాటు గృహ నిర్బంధంలో ఉండి..ఇటీవల విడుదలైన మెహబూబా ముఫ్తీ శుక్రవారం(అక్టోబర్-23,2020)మాట్లాడుతూ…జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించే వరకుఎన్ని‌కల్లో పోటీ‌చే‌య‌బో‌మని, పాత జమ్ముకశ్మీర్‌ జెండా ఎగిరే వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.