Menthi curry : రైతులకు అదాయన్నిచ్చే మెంతి కూర సాగు…

విత్తనాలను నాటిన సమయంలో నీరు బాగా పట్టాలి. తరువాత 7 నుండి 10 రోజులు విరామం ఇచ్చి మళ్ళీ నీళ్ళు పట్టాలి.

Menthi curry : రైతులకు అదాయన్నిచ్చే మెంతి కూర సాగు…

Menthi

Menthi curry : మెంతి.. ఈ పంట దక్షిణ తూర్పు ఐరోపా మరియు పశ్చిమ ఆశియా దేశానికి సంబంధించినది. దీన్ని ఆకు కూరగాను, సుగంధ ద్రవ్యంగాను మరియు ఔషద మొక్కగానూ ఉపయోగిస్తారు. ఈ మొక్క యొక్క లేత ఆకులు మరియు కాండాన్ని ఆకు కూరగా మరియు విత్తనాలను సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. దీని ఆకుల్లో ప్రోటీన్‌ మరియు విటమిన్‌-సి లు అధికంగా ఉంటాయి.

ఈ మొక్కల్లో అధిక ఔషద గుణాలు ఉండటం వల్ల దీన్ని మలబద్ధకం నివారణకు, అజీర్ణం సంబంధ వ్యాధుల నివారణకు, కాలేయ మరియు ప్లీహంలను ఉత్తేజ పరచటానికి, ఆకలి పుట్టించటానికి మూత్ర సంబంధ వ్యాధుల నివారణకు, కొలస్ట్రాల్‌ తగ్గించటానికి, మధుమేహ నివారణకు, క్యాన్సర్‌ రాకుండా ఉంచటానికి, టెస్టొస్టీరాన్‌ హార్మోన్‌ సమతుల్యతకు మరియు బరువు తగ్గటానికి మందుగా ఉపయోగిస్తారు.

ఈ పంటను ముఖ్యంగా మన దేశం నుండి సౌదీ అరేబియా, జపాన్‌, శ్రీలంక, కొరియా మరియు ఇంగ్లాండ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌, మహరాష్ట్ర, పంజాబ్‌ మరియు తమిళనాడు రాష్ట్రాలు మన దేశంలో ఈ పంటను పండించే ముఖ్యమైన రాష్ట్రాలు. ఇది ఒక ఏక వార్షిక మొక్క సుమారుగా ఒక మీటరు ఎత్తు పెరుగుతుంది.ఇటీవలి కాలంలో కూరగాయల రేట్టు పెరగటంతో అంతా తక్కువ రేటులో దొరికే ఆకుకూరలను ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈక్రమంలో ఆకు కూరలకు మార్కెట్లో మంచి డిమాండ్ , ధర లభిస్తుంది. ప్రస్తుతం చాలా మంది రైతులు ఆకు కూరల సాగు వైపు దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ప్రతి ఒక్క వంటగదిలో మనకు ఈ మెంతికూర కనిపిస్తుంది మెంతికూర లేని వంట ఉండనీ ఇల్లు ఒక్కటి కూడా ఉండదు. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ చిన్న మొక్కలు ఎన్నో ఔషధగుణాలున్నాయి. ఈ చిన్నపాటి మొక్కలను సాగు చేయడం కూడా చాలా సులభం. రైతులు మెంతి సాగు ద్వారా మంచి అదాయాన్ని పొందవచ్చు.

శీతాకాలం ముగింపు దశలో ఉండగా మెంతికూర సాగుకు అనుకూలంగా ఉంటుంది. విత్తిన విత్తనాలు త్వరగా మొలకెత్తాలి అంటే భూమిలో 1/4 వంతు లోతుతో గుంటలు చేసి, ఒక్కో గుంటకి 8 నుండి 18 అంగుళాల దూరంలో వరుసలలో నాటాలి. కొన్ని రోజులలోనే ఇవి మొలకెత్తి బయటికి వస్తాయి. క్రమం తప్పకుండా నీళ్ళు పట్టాల్సి ఉంటుంది. అతిగా నీరు పెట్టడం ఈ చిన్ని మొక్కలకు మంచిది కాదు. ఎందుకంటే అతిగా తేమ ఉంటే ఈ మొక్కలు పెరగవు.

సాధారణంగా మెంతి కూరను పొడి బారిన నెలలో నాటుతారు. ఎందుకంటే ఆ పొడి నేలలో 6.5 నుండి 8.2 వరకు PH విలువను కలిగిన ఆల్కలిన్ తటస్థంగా ఉంటుంది. దీని కారణంగా ఆ మొక్కలు త్వరగా పెరుగుతాయి. అందువల్ల విత్తనాలు నాటిన 20 నుండి 30 కోతకు సిద్ధంగా ఉన్న ఆకులు ఉత్పత్తి అవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మెంతి రకాల విషయానికి వస్తే కో-1, రాజేంద్ర కాంతి, ఆర్‌ ఎం టి-1, లాం సెలెక్షన్‌-1, కసూరి, ఆర్‌ ఎం టి-143, మేథి నెం-47, మేథి నెం-14, ఇ సి-4911, హెచ్‌-103 మరియు హిస్సార్‌ సొనాలి మొదలైనవి ముఖ్యమైన రకాలు. వీటిలో మేథి నెం-47 మరియు మేథి నెం-14 రకాలు అధిక దిగుబడినిచ్చే రకాలు.

ఒకహెక్టార్ కి 15టన్నుల వ్యవసాయ యార్డ్ ఎరువుతో పాటు, 25 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం మరియు 50 కిలోల పొటాష్ ను ఉపయోగించడం జరుగుతుంది. నత్రజని మోతాదులో సగం మరియు భాస్వరం మరియు పొటాష్ మొత్తం పరిమాణం మొదటి సారి ఎరువులు చల్లేటప్పుడు ఉపోయోగిస్తారు. మిగిలిన సగం నత్రజని విత్తిన 30 రోజుల తరువాత ఉపయోగిస్తారు. మరింత ఆరోగ్యవంతమైన ఆకు పెరుగుదలను పొందడానికి, ప్రతి కటింగ్ తర్వాత నత్రజనిని వాడాల్సి ఉంటుంది.

విత్తనాలను నాటిన సమయంలో నీరు బాగా పట్టాలి. తరువాత 7 నుండి 10 రోజులు విరామం ఇచ్చి మళ్ళీ నీళ్ళు పట్టాలి. 25 రోజుల నుండి 30 రోజుల కాల వ్యవధిలో 4 నుండి 5 సెంటి మీటర్ల పొడవు ఉన్న చిన్న చిన్న మొలకలు భూమి నుండి బయటకు రావడం మనం గమనించవచ్చు. తరువాతి 15 రోజుల కాలంలో మనకు కోతకు సిద్ధంగా ఉన్న మొక్కలుగా ఎదుగుతాయి. విత్తనాల కోసం సాగు చేసేదైతే పంట పూతదశకు రాక మునుపు 1-2 సార్లు కత్తిరించుకుంటే మంచిది.

గింజల కోసం సాగుచేసే పంటకైతే, మొక్క దిగువ భాగాన గల ఆకులు ఎండి రాలుతూ, కాయలు లేత గోధుమ రంగులోకి మారే సమయం కోతకు అనుకూలమైనది. కాయలు ఎండిన తరువాత మొక్కలను పూర్తిగా భూమిలోనుండి పీకివేసి, ఎండలో బాగా ఎండబెట్టుకొని, కర్రలతో కొట్టీ లేదా చేతులతో నలుపుకొని కానీ గింజలను వేరుచేసుకోవాలి. అలా వేరుచేసుకోగా వచ్చిన గింజలను బాగా శుభ్ర పరచుకొని, ఎండలో బాగా ఆరబెట్టుకొవాలి. తరువాత వాటిని గోనెసంచుల్లో నిల్వ వుంచుకోవచ్చు. విత్తనాలు మరియు ఆకుకూర ప్రయోజనాల కోసం పంటను వేస్తే ఒక హెక్టారు కు 1200 నుండి 1500 కిలోల మెంతులు, 800 నుండి 1000 కిలోల మెంతి కూర దిగుబడి పొందొచ్చు