ప్రయాణీకుల్లో ఆందోళన : మెట్రో రైలు పిల్లర్లకు బీటలు

  • Published By: madhu ,Published On : April 20, 2019 / 07:42 AM IST
ప్రయాణీకుల్లో ఆందోళన : మెట్రో రైలు పిల్లర్లకు బీటలు

నమ్మ బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్‌కు చెందిన రెండు స్తంభాలకు బీటలు కనిపించాయి. జయనగర సౌత్‌ ఎండ్‌ కూడలిలోని 66వ నంబరు స్తంభానికి ప్రమాదం ఎదురైనట్లు ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం గుర్తించారు. అక్కడి 67వ నంబరు స్తంభం బీటలను తొలుత గుర్తించిన అధికారులు మరమ్మతు చేశాక.. సమీపంలోని 66వ నంబరు స్తంభానికి ఇదే తరహా ముప్పు ఎదురైనట్లు నిపుణులు వెల్లడించారు. బేరింగ్‌ విభాగం వద్ద బీటలు కనిపించాయి.

వాటికి మరమ్మతులు చేసి రైలు ప్రయాణానికి అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. స్తంభం పక్కనే ఇనుప కడ్డీలతో తాత్కాలిక స్తంభాన్ని ఊతంగా అమర్చారు. 
6 నెలల కిందట ట్రినిటి కూడలిలో స్టేషన్‌ వద్ద ఓ స్తంభానికి ఇలాంటి సమస్యే ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రెండు స్తంభాల్లో బీటలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. వాటి పరిశీలనకు విదేశీ సాంకేతిక నిపుణుల్ని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

మెట్రో పిల్లర్లకు బీటలు వచ్చాయనే వార్త ప్రకంపనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా మెట్రోలో ప్రయాణించే వారు భయపడుతున్నారు. ఎలాంటి భయం అవసరం లేదని అక్కడి మెట్రో అధికారులు వెల్లడిస్తున్నారు.