పౌరసత్వం చిక్కులు : రాహుల్ గాంధీకి హోంశాఖ నోటీసులు

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 06:06 AM IST
పౌరసత్వం చిక్కులు : రాహుల్ గాంధీకి హోంశాఖ నోటీసులు

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం చెలరేగింది. అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన సమయంలో రాహుల్ పౌరసత్వానికి సంబంధించిన అంశం తెరమీదకు వచ్చింది. రాహుల్ గాంధీ బ్రిటన్, భారత్.. రెండు దేశాల పౌరసత్వాలు కలిగి ఉన్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా అందజేశారు. రాహుల్ విన్సీ పేరున్న సర్టిఫికెట్లను ఈసీకి సమర్పించారు. దీంతో రాహుల్ గాంధీకి కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది.

రెండు వారాల్లోగా పౌరసత్వంపై వివరణ ఇవ్వాలని రాహుల్ ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అమేథీలో నామినేషన్ దాఖలు సమయంలో రాహుల్ ఇచ్చిన అఫిడవిట్ లో రాహుల్ విన్సీ అనే పేరుతో ఉన్న విద్యార్హత సర్టిఫికెట్లను ఈసీకి సమర్పించారు. దీని ఆధారంగా సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.

రాహుల్‌ గాంధీకి నాలుగు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని, ఒకదానిపై ఆయన పేరు రౌల్‌ విన్సీ, క్రిస్టియన్‌గా నమోదైందని సుబ్రహ్మణ్య స్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు. రాహుల్‌ పౌరసత్వంపై అమేథిలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన ధ్రువ్‌ లాల్‌ సైతం ఈసీకి ఫిర్యాదు చేశారు. బ్రిటన్ లో రిజిస్టర్ అయిన ఓ కంపెనీ డైరెక్టర్ గా రాహుల్ గాంధీ ఉన్నారని.. 2005-06లో కంపెనీ యాన్వుల్ రిటర్న్స్ ఫైల్ చేసిన సమయంలో రాహుల్‌ గాంధీ తనని బ్రిటన్‌ పౌరుడిగా ప్రకటించుకున్నారని ధ్రువ్‌లాల్‌ వెల్లడించారు. ఈ మేరకు ధ్రువ్‌లాల్‌ న్యాయవాది రవిప్రకాష్‌ హోంశాఖకు పౌరసత్వం విషయమై ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతీయులు కాని వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే విషయాన్ని న్యాయవాది రవిప్రకాష్ వెల్లడించారు. ఇటీవల నామినేషన్ వేసే సమయంలోనూ ఈ మేరకు రాహుల్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.