Mid-Air Wedding : విమానంలో వివాహం..విచారణకు డీజీసీఏ ఆదేశం

తమిళనాడుకు చెందిన ఓ జంట అరుదైన వివాహం చేసుకుంది. విమానంలోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

Mid-Air Wedding : విమానంలో వివాహం..విచారణకు డీజీసీఏ ఆదేశం

Mid Air Wedding With Baraatis Not Following Covid Norms Invites Dgca Wrath

MID AIR WEDDING : తమిళనాడుకు చెందిన ఓ జంట అరుదైన వివాహం చేసుకుంది. విమానంలోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఏ ఒక్క‌రూ కూడా క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌లేదు. క‌నీసం మాస్కులు కూడా ధ‌రించ‌లేదు. విమానంలో వివాహంకి సంబంధించిన ఫొటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఘటనపై విమాన సంస్థ స్పైస్‌జెట్‌పై ఆగ్ర‌హించిన డీజీసీఏ..వివాహంలో కొవిడ్​ నిబంధనలు పాటించలేదన్న ఆరోపణల నేపథ్యంలో విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి విమాన సిబ్బందిని సస్పెండ్ చేసింది.

అసలేం జరిగింది
త‌మిళ‌నాడు రాష్ట్రంలోని మ‌దురై జిల్లాకి చెందిన రాకేశ్‌-ద‌క్షిణ త‌మ వివాహాన్ని వినూత్నంగా చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో వీరి పెళ్లికోసం పెద్దలు స్పైస్‌జెట్ కు చెందిన చార్డెట్ విమానాన్ని బుక్‌ చేశారు. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో 161 మందితో విమానం మదురై నుంచి బెంగళూరుకి బయలుదేరింది. వధూవరులు, కుటుంబసభ్యులు, బంధువులు మాత్రమే విమానం ఎక్కారు. వీరందరికీ ముందుగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించి నెగెటివ్‌గా తేలిన తర్వాత ప్రయాణానికి అనుమతించారు. కాసేపటి తర్వాత విమానం గాల్లోనే ఉన్న సమయంలో వధువు దక్షిణ మెడలో వరుడు రాకేష్‌ తాళి కట్టారు. విమానంలో అందరూ ఫోటోల‌కు ఫోజులిస్తూ ఎంజాయ్ చేశారు. ఏ ఒక్క‌రూ కూడా క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌లేదు. క‌నీసం మాస్కులు కూడా ధ‌రించ‌లేదు. విమానం బెంగళూరు వెళ్లి, తిరిగి మదురైకి చేరుకుంది.

మొత్తానికి ఈ జంట వివాహం వీడియోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతో విమానంలో వివాహ ఘ‌ట‌న‌పై డీజీసీఏ విచార‌ణ‌కు ఆదేశించింది. స్పైస్ జెట్‌పై కేసు న‌మోదుకు డీజీసీఏ ఆదేశించింది. ఈ వ్య‌వ‌హారంపై మ‌ధురై ఎయిర్‌పోర్టు డైరెక్ట‌ర్ కూడా స్పందించారు. నిన్న మ‌ధురై నుంచి బెంగ‌ళూరు వెళ్లేందుకు స్పైస్‌జెట్ చార్టెడ్ ఫ్లైట్‌ను బుక్ చేసుకున్నారు. కానీ ఆ విమానంలో వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్న‌ట్లు త‌మ‌కు తెలియ‌దు అని ఎయిర్‌పోర్టు డైరెక్ట‌ర్ ఎస్ సెంథిల్ వ‌ల‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన స్పైస్ జెట్ సంస్థ.. వివాహ వేడుక కోసం ట్రావెల్ ఏజెంట్ ద్వారా స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానాన్ని బుక్ చేసుకున్నారు. ఎవ‌రైతే బుక్ చేసుకున్నారో వారికి కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని స్ప‌ష్టంగా చెప్ప‌డం జ‌రిగింది. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే అనుమ‌తి నిరాక‌రించ‌బ‌డుతుంద‌ని కూడా చెప్పాం. అయిన‌ప్ప‌టికీ వారు కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌లేదు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్పైస్ జెట్ ప్ర‌క‌టించింది.