బహదూర్ కి బైబై….చరిత్రగా మిగలనున్న కార్గిల్ విజేత మిగ్-27

  • Published By: venkaiahnaidu ,Published On : December 26, 2019 / 10:31 AM IST
బహదూర్ కి బైబై….చరిత్రగా మిగలనున్న కార్గిల్ విజేత మిగ్-27

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాలుగు దశాబ్దాల పాటు ముఖ్య పాత్ర పోషించిన శక్తివంతమైన మిగ్-27 యుద్ధ విమానాలు ఇక కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న ఏడు మిగ్-27విమానాలు శనివారం నుంచి ఇక కనుమరుగైపోనున్నాయి. 1999 కార్గిల్ యుద్ధసమయంలో ఆపరేషన్ సేఫ్‌డ్ సాగర్‌లో కీలకంగా వ్యవహరించి “ఏస్ ఎటాకర్”గా తన సత్తా చూపి పైలెట్లతో ముద్దుగా బహదూర్ అని పిలిపించుకునే ఈ యుద్ధ విమానాలు రాజస్తాన్ లోని జోధ్ పూర్ ఎయిర్ బేస్ నుంచి శుక్రవారం(డిసెంబర్-27,2019)చివరిసారిగా గగనవిహారం చేస్తాయి

శుక్రవారం తర్వాత దేశంలో ఎక్కడా ఈ విమానాలు ఎగురవు. ఈ కార్యక్రమానికి ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా సహా పలువురు హాజరుకానున్నారు.  జోధ్‌పూర్‌లో 29వ స్వ్కాడ్రన్‌కు చెందిన సిబ్బంది మిగ్ 27 బహదూర్‌ను చివరిసారిగా నడపనున్నారు. ఈ విమానాల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధవిమానాల ప్రస్థానానికి ముగింపు పడుతుంది. ప్రస్తుతం ఏ దేశంలోనూ ఇవి వినియోగంలో లేవు. 

అయితే, ఇటీవల కాలంలో మిగ్ -27 ప్రమాదాలు తరుచూ చోటుచేసుకోవడంతో వీటి పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా నుంచి తీసుకొచ్చిన మిగ్‌లు సరిగా పని చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా యుద్ధ విమానాలు కుప్పకూలిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా మిగ్ 27 యుద్ధ విమానాలను దశలవారిగా వైమానిక దళం నుంచి తొలగిస్తున్నారు.

గత ఏడాది డిసెంబరులో జోధ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి ఒకటి, మూడేళ్ల కిందట పశ్చిమ బెంగాల్‌లోని హసీమారాలో మరో రెండింటిని తొలగించారు. ఈ విమానాలను 1981లో నాటి సోవియట్ యూనియన్ నుంచి కొనుగోలు చేశారు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మొత్తం 165 మిగ్ 27 విమానాలను నియమించుకోగా, తర్వాత 80 విమానాలను అధునీకరించింది. గంటలకు 1,700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మిగ్ యుద్ధ విమానాలకు 4000 కిలోల బరువైన పేలోడ్లను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది.