అమెరికా విదేశాంగ,రక్షణ మంత్రులకు ఢిల్లీలో ఘనస్వాగతం

  • Published By: venkaiahnaidu ,Published On : October 26, 2020 / 04:52 PM IST
అమెరికా విదేశాంగ,రక్షణ మంత్రులకు ఢిల్లీలో ఘనస్వాగతం

Mike Pompeo, Secretary Esper arrive in India మంగళవారం న్యూఢిల్లీలో జరిగే మూడవ యూఎస్-ఇండియా 2 + 2 ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి(విదేశాంగ మంత్రి)మైక్ పాంపియో, రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ సోమవారం(అక్టోబర్-26,2020) మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. మైక్‌ పాంపియో వెంట ఆయన భార్య సుసాన్ కూడా ఉన్నారు. వీరికి న్యూఢిల్లీలో దౌత్య అధికారులు ఘన స్వాగతం పలికారు. గౌరవ వందనంతో భారత అధికారులు స్వాగతం పలికారు. అయితే, మొదటి రెండు ద్వైపాక్షిక సంభాషణలు 2018 సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో, 2019 లో వాషింగ్టన్ డీసీలో జరిగాయి. మూడవది మంగళవారం న్యూఢిల్లీలో జరుగనున్నది.





ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సహకారంపై మంగళవారం వీరు చర్చలు జరపనున్నారు. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో భారత్‌-అమెరికా మంత్రుల భేటీలో ఈ అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. రెండు రోజుల పర్యటన సందర్భంగా పాంపియో, ఎస్పెర్….భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపి.. ప్రధాని మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తో సమావేశం కానున్నారు.



భారత్‌తో సరిహద్దు ప్రతిష్టంభనతో పాటు, దక్షిణ చైనా సముద్రంలో సైనిక పాటవాలు, హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై బీజింగ్‌ వైఖరి వంటి పలు అంశాలపై కొద్ది నెలలుగా చైనా తీరును అమెరికా తప్పుపడుతోంది. ఇక అమెరికన్‌ మంత్రులతో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై సంప్రదింపులు సాగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ చర్చలు ప్రాంతీయ భద్రతా సహకారం, రక్షణ సమాచార భాగస్వామ్యం, సైనిక పరస్పర చర్యలు, రక్షణ వాణిజ్యం అనే నాలుగు అంశాలపై దృష్టి సారించనున్నట్లు గత వారం యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.



కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వీరి పర్యటన ప్రాధాన్యతనిస్తున్నది. మరోవైపు, కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా చాలా దౌత్య సమావేశాలు, పరస్పర చర్యలు ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో..మైక్ పాంపియో, ఎస్పెర్ వ్యక్తిగతంగా సందర్శించడం యొక్క ప్రాముఖ్యతను ఇరువైపుల అధికారులు ఎత్తిచూపారు. ఇది భారతదేశంతో సంబంధానికి అమెరికా చాలా ప్రాధాన్యతనిస్తుందని చెప్పవచ్చు. మైక్‌ పాంపియో, మార్క్‌ ఎస్పెర్ తమ పర్యటనలో శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియాలను కూడా సందర్శించనున్నారు. ఈ ప్రాంతాల్లో చైనా యొక్క విస్తరణవాద నమూనాల నేపథ్యంలో వీరి పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకున్నది.

ఎస్పర్​తో రాజ్​నాథ్​ భేటీ
భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. ఇవాళ అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్​తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చీఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఆర్మీ చీఫ్​ జనరల్​ మనోజ్​ ముకుండ్​ నరవణె, ఐఏఎఫ్​ చీఫ్​ ఎయిర్​ చీఫ్​ మార్షల్​ ఆర్​కేఎస్​ బదౌరియా, నేవీ చీఫ్​ అడ్మిరల్​ కరంబిర్​ సింగ్​ పాల్గొన్నారు.