ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు బిగ్ షాక్, అమ్మకానికి వ్యక్తిగత సమాచారం

ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు బిగ్ షాక్, అమ్మకానికి వ్యక్తిగత సమాచారం

Millions of Airtel numbers leaked: దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ కు(airtel) సైబర్ హ్యాకర్లు భారీ షాక్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 25లక్షల మంది ఎయిర్ టెల్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వారు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆ సమాచారాన్ని అమ్మకానికి పెట్టారనే వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్న వారి అడ్రస్, ఆధార్ నెంబర్, జెండర్(లింగ) వంటి పర్సనల్ వివరాలతో పాటు ఫోన్ నెంబర్లను కొందరు హ్యాకర్లు ఎయిర్‌టెల్ సర్వర్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా దొంగలించారు.

భారత్ లోని ఎయిర్‌టెల్ వినియోగదారులందరి వివరాలు తమ దగ్గరున్నాయని, వారి డేటాను విక్రయించాలనుకుంటున్నట్లు హ్యాకర్లు తెలిపినట్టు.. ఇంటర్నెట్ సెక్యూరిటీ పరిశోధకుడు రాజశేఖర్ రాజహరియా ఈ సమాచారాన్ని వెల్లడించారు. సైబర్ హ్యాకర్లు ముందుగా ఎయిర్‌టెల్ భద్రతా బృందాలను బ్లాక్ మెయిల్ చేసి 3వేల 500 డాలర్లు విలువైన బిట్‌కాయిన్ల వసూలు చేయడానికి ప్రయత్నించారు. అందుకు కంపెనీ తలొగ్గకపోవడంతో హ్యాకర్లు రెచ్చిపోయారు. ఎయిర్ టెల్ వెబ్‌సైట్‌లో దొంగలించిన డేటాను బహిరంగ మార్కెట్ లో అమ్మకానికి ఉంచారు. దాని కోసం ఒక వెబ్‌సైట్‌ను సృష్టించారు. దొంగలించిన డేటాలో ఎక్కువ శాతం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని ఎయిర్ టెల్ కస్టమర్లవని తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని రాజశేఖర్‌ రాజహరియా బయటపెట్టారు. తన ట్విట్టర్‌ ఖాతాలో ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను పోస్ట్‌ చేశారు.

దీనిపై ఎయిర్‌టెల్‌ ప్రతినిధులు స్పందించారు. కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించి అమ్మకానికి పెట్టారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఎయిర్‌టెల్‌ తన వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తమ దగ్గరి నుంచి ఎలాంటి డేటా బయటకి లీక్ కాలేదని, సేఫ్ గా తమ దగ్గరే ఉందని ప్రతినిధులు తెలిపారు. వదంతులు నమ్మొద్దని కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు.