ఈవీఎంలో ఫస్ట్ బటన్ తప్ప ఏది నొక్కినా షాక్ కొడుతుంది

  • Published By: vamsi ,Published On : April 18, 2019 / 01:10 AM IST
ఈవీఎంలో ఫస్ట్ బటన్ తప్ప ఏది నొక్కినా షాక్ కొడుతుంది

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలవేళ రాజకీయ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఓ వైపు ప్రలోభాలు.. మరోవైపు బెదిరింపులు.. ఇలా రాజకీయ నాయకులు ఇష్టం వచ్చిన రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో చత్తీస్ ఘడ్ కు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదం అవుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్ మెషిన్‌లో మొదటి బటన్ కాకుండా వేరేది నొక్కితే ఎలక్ట్రిక్ షాక్‌ తగులుతుందంటూ ఛత్తీస్‌గఢ్‌ ఎక్సైజ్, వాణిజ్యం, పరిశ్రమ శాఖ మంత్రి కవాసి లక్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన.. ఈవీఎంలలో మొదటి బటన్ మీదే నొక్కాలని, రెండో బటన్ నొక్కితే దాంట్లో ఉన్న కరెంట్ వల్ల మీకు షాక్ తగులుతుంది అని, మూడవ బటన్ మీద నొక్కినా అదే పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యలు చేశారు.

కాగా మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. రెండో దశ పోలింగ్‌కు ఒకరోజు ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎన్నికల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది. ఈవీఎంలో అటువంటివి ఏమీ జరగవని, ఏ బటన్ నొక్కినా కూడా షాక్ కొట్టదని వెల్లడించింది.