భారీ ఊరట : 400 ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే శాఖ

10TV Telugu News

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను  మే 4 నుంచి మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించింది.  కాగా  లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్ధులు, పర్యాటకులను వారి వారి స్వస్ధలాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడిపించేందుకు  కేంద్రం ఆమోదం తెలిపింది. 

రోజుకు 400 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిధ్ధం చేసింది. ఈ రైళ్లలో ఛార్జి ఎంత వసూలు చేయాలనే దానిపై రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. అయితే  రైలులో ప్రయాణించే ప్రయాణికులు సామాజిక దూరం పాటించాలని సూచించింది.  

ప్రయాణికులు మాస్కులు, శానిటైజర్లు ఆహారాన్ని రైల్వే శాఖే అందిస్తుంది. లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన విద్యార్ధులు, పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్లిన భక్తులు పర్యాటకులు, ఇతరులకు ఊరట కల్పిస్తూ కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ వారిని స్వస్ధలాలకు తీసుకురావటానికి  రైళ్లు నడపాలని వివిధ రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు  రావటంతో కేంద్ర కేబినెట్ ఈనిర్ణయం తీసుకుంది.