కలెక్టర్ ను పల్లకిలో మోసుకెళ్లిన గ్రామస్థులు

  • Published By: venkaiahnaidu ,Published On : August 30, 2019 / 09:25 AM IST
కలెక్టర్ ను పల్లకిలో మోసుకెళ్లిన గ్రామస్థులు

మారుమూల గ్రామ పర్యటనకు వెళ్లిన ఓ కలెక్టర్‌కు అనూహ్య అనుభవం ఎదురైంది. కలెక్టర్‌ను చూసిన గ్రామస్థులు ఆయనను పల్లకిలో మోసుకుంటూ గ్రామంలోకి తీసుకెళ్లారు. ఆ గ్రామానికి ఓ కలెక్టర్‌ రావడం అదే తొలిసారి మరి. 

మిజోరాం రాష్ట్రంలోని సియహా జిల్లాలోని అత్యంత మారుమూల గ్రామమైనా తిస్పోయ్ లో 400మంది జనాభా మాత్రమే ఉంటారు. ఇక్కడ కనీస సౌకర్యాలు అంతంతమాత్రమే. కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదు. ఇటీవలే అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద రహదారి నిర్మిస్తున్నారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు సియహా జిల్లా కలెక్టర్‌ భూపేశ్ చౌదరి ఆగస్టు-27,2019న తిసోపి వెళ్లారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు.

అయితే ఇప్పటివరకు తిసోపి గ్రామానికి ఏ ఒక్క కలెక్టర్‌ కూడా వెళ్లలేదట. భూపేశ్ చౌదరి వస్తున్నారని తెలియగానే గ్రామస్థులు ఎంతో ఆనందపడ్డారు. ఆయన రాక కోసం ఎదురుచూశారు. పొలిమేరలోకి రాగానే కలెక్టర్ ను పల్లకిలో ఎక్కించుకుని గ్రామంలోకి మోసుకెళ్లారు. భూపేశ్ వద్దని వారించినా వారు వినిపించుకోలేదు. 

ఈ సందర్భంగా భూపేశ్‌ చౌదరి మాట్లాడుతూ…నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నన్ను చూడగానే వారు ఎంతో సంతోషపడ్డారు. ఇప్పటివరకు ఏ కలెక్టర్‌ అక్కడకు వెళ్లలేదు. వారు నన్ను ఆదరించిన తీరు ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామస్థాయిలోకి వెళ్తేనే వారి సమస్యలు అర్థమవుతాయని అన్నారు.