MK Stalin Swears: స్టాలిన్ అనే నేను

MK Stalin Swears: స్టాలిన్ అనే నేను

Mk Stalin Swears

MK Stalin Swears: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి తరపున ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 9 గంటలకు తమిళనాడు రాజ్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

స్టాలిన్‌తో పాటు 34 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కరుణానిధి కేబినేట్‌లో పనిచేసినవారికి తన మంత్రివర్గంలోను చోటు కల్పించారు స్టాలిన్. 34 మందితో కూడిన ఫుల్ లెంగ్త్ కేబినెట్ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేలోపే ప్రభుత్వ పాలనలో భాగంగా.. కరోనా పరిస్థితులను తెలుసుకుంటూ ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం కొద్దిమంది సమక్షంలో జరిగింది.

స్టాలిన్‌ క్యాబినెట్‌లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు చోటు దక్కగా.. ఆర్థికశాఖను పీడీఆర్ పళనివేల్‌ త్యాగరాజన్‌కు, ఆరోగ్యశాఖను సైదాపేట ఎమ్మెల్యే సుబ్రమణ్యంలకు అప్పగించారు. హోంశాఖను మాత్రం స్టాలిన్‌ దగ్గరే ఉంచుకొన్నారు. సీనియర్ నేత దురైమురుగన్‌కు జలవనరులు, చిన్న, భారీ తరహా నీటి ప్రాజెక్టులు, అసెంబ్లీ వ్యవహారాలు శాఖను అప్పగించారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో మాజీ సీఎంల కుమారులు ముఖ్యమంత్రులు అవగా.. తమిళనాడులో మాత్రం ఓ మాజీ సీఎం కుమారుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. కశ్మీర్‌లో షేక్‌ అబ్దుల్లా కుమారుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన మనవడు ఉమర్‌ అబ్దుల్లా; ముఫ్తీ మహ్మద్‌ సయ్యద్‌ కుమార్తె మెహబూబా, ఒడిశాలో బిజూ పట్నాయక్‌ కుమారుడు నవీన్‌ పట్నాయక్, హరియాణాలో దేవీలాల్‌ కుమారుడు ఓం ప్రకాశ్‌ చౌతాలా..

ఉత్తరప్రదేశ్‌లో ములాయం కుమారుడు అఖిలేష్‌ యాదవ్, కర్ణాటకలో దేవేగౌడ కుమారుడు కుమారస్వామి, ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులో 1952 నుంచి పనిచేసిన ముఖ్యమంత్రుల వారసులు ఎవరూ కూడా ముఖ్యమంత్రి కాలేదు.