సాధువుల హత్య కేసు… అమిత్ షాకు ఉద్దవ్ హామీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2020 / 04:17 PM IST
సాధువుల హత్య కేసు… అమిత్ షాకు ఉద్దవ్ హామీ

దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ మహారాష్ట్రలోని పాలిఘర్‌లో ఇద్దరు సాధువులను గుర్తు తెలియని కొందరు మూకదాడి చేసి చంపడం కలకలం రేపుతోంది. ఈ నెల 16న సాధువులు తమ గురువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఓ వాహనంలో వెళ్తున్నారు. దారిలో దాదాపు 110 మంది వారి వాహనాన్ని అడ్డుకుని డ్రైవర్ ను,ఇద్దరు సాధువులను బయటకు లాగి తీవ్రంగా కొట్టి చంపేశారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కూడా మూకను అడ్డుకోలేక ప్రేక్షకపాత్ర వహించారు. మత విద్వేషాలతోనే సాధువులను హత్య చేసినట్లు పుకార్లు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కేసుకి సంబంధించి నిందితులను అరెస్ట్ చేసి జైలుకి తరలించినట్లు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తెలిపారు.

సాధువుల హత్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడానని,ఈ కేసుని తాను చూస్తానని ఆయనకు హామీ ఇచ్చినట్లు ఉద్దవ్ తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టొద్దని ఆయన చెప్పారన్నారు. ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ఉద్దవ్ తెలిపారు. దీనిలో హిందూ, ముస్లిం వివాదం లేదు. దొంగలంటూ పుకార్లు రావడం వల్లే సాధువులపై దాడి జరిగిందని, ఈ ఘటనను రాజకీయం చేయొద్దుఅని ఉద్దవ్ తెలిపారు. ఇద్దరు పోలీసులను కూడా సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

మరోవైపు ఈ దాడిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు విధించాలని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అనేక హిందూ సంఘాలు కూడా ఈ ఘటనపై మండిపడుతున్నాయి. మంగళవారం(ఏప్రిల్-16,2020)రాత్రి దేశఆర్థిక రాజధాని ముంబైకి 125కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనకు కారణమైన 110 మందిని పాల్‌ఘర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 9 మంది మైనర్లు కూడా ఉండగా, వారిని జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. ఏప్రిల్ 30 వరకు నిందితులందరినీ పోలీసులు తమ కస్టడీలోనే ఉంచనున్నారు.  

Also Read | గొంతు తగ్గించి మాట్లాడు…మహిళా రిపోర్టర్ పై ట్రంప్ అసహనం