కార్గిల్ లో 145 రోజుల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుధ్దరణ

  • Published By: chvmurthy ,Published On : December 27, 2019 / 01:11 PM IST
కార్గిల్ లో 145 రోజుల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుధ్దరణ

జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ లో ఇంటర్నెట్ సేవలను తిరిగి పునరుధ్దరించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం  రద్దు చేసింది. దీంతో  ఆరోజు  నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. 

ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. 145 రోజుల తర్వాత కార్గిల్‌లో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గత నాలుగు నెలల నుంచి కార్గిల్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. అయితే ఇంటర్నెట్‌ సేవలను దుర్వినియోగం చేసుకోవద్దని పలు మతాల పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

పరిస్థితులను బట్టి జమ్మూ రీజియన్‌తో పాటు కశ్మీర్‌ వ్యాలీలో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించనున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత, నాలుగు నెలలపాటు జమ్మూకశ్మీర్‌లో మోహరించిన 7 వేల కేంద్ర పారామిలటరీ బలగాలను ఇటీవలే కేంద్రం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 

కార్గిల్ లో బ్రాడ్ బ్యాండ్ సేవలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. లడఖ్ లోఇంటర్నెట్ సేవలు పునరుధ్దరించబడినప్పటికీ  కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలు ఎప్పుడు పూర్తిగా  పునరుధ్దరించబడతాయి అనే దానిపై స్పష్టత రాలేదు. అలాగే కాశ్మీర్ లోయలో అదుపులోకితీసుకున్ననాయకులను ఎప్పుడు విడుగదల చేస్తారో కూడా అర్ధంకాని పరిస్ధితి ఉంది.