ఎర్రకోట వేదికగా నెహ్రూ రికార్డు బద్దలు కొట్టిన మోడీ.. ఈ సారి ఏం చేస్తారో మరి

ఎర్రకోట వేదికగా నెహ్రూ రికార్డు బద్దలు కొట్టిన మోడీ.. ఈ సారి ఏం చేస్తారో మరి

ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకొచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్ర్యం కోసం జరిగిన అనేక ఉద్యమాలన్నింటిని కలిపి భారత స్వాతంత్య్రోద్యమంగా చెబుతారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్య్రోద్యమంలో కీలక ఘట్టాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందంచటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించి అనేక రాజకీయపక్షాలు, సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. .

16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను.. 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పొచ్చు. జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాలలో ఉద్యమించింది. అయితే ఇతర నాయకులు మాత్రం సాయుధ పోరాటాలతో ముందుకెళ్లారు. సుభాష్ చంద్ర బోస్ సాయుధ సంగ్రామమే సరైందిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్ధిక స్వాతంత్రానికై పిలుపునిచ్చారు.

రెండో ప్రపంచయుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధృత రూపం దాల్చాయి. బ్రిటీష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1948లో నిర్ణీతమైన స్వాతంత్ర్య దినాన్ని ముందుకు జరుపుతూ.. 1947 ఆగస్టు 15న జరగాలని నిర్ణయించారు. రెండో ప్రపంచ యుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్య్రానికి ఆ రోజును బాటన్ ఎంచుకున్నారు. చివరకు గాంధీ లీడర్‌షిప్‌లో 1947 ఆగస్ట్‌ 15న భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించింది. .

పంద్రాగస్టున ప్రధాని ఎర్రకోటపై ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేదికపై నెహ్రూ 17 సార్లు.. లాల్‌ బహదూర్‌ శాస్తి 2సార్లు.. ఇందిరాగాంధీ 16సార్లు ప్రసంగించారు. మొరార్జీ దేశాయ్‌ రెండు.. చరణ్ సింగ్‌ ఒకసారి.. రాజీవ్‌ గాంధీ, పీవీ నర్సింహ్మారావులు ఐదుసార్లు, వాజ్‌పేయి ఆరుసార్లు జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఇక వీపీసింగ్‌, దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌లో ఒకసారి మాత్రమే మాట్లాడగా మన్మోహన్ సింగ్ పదిసార్లు స్పీచ్‌ ఇచ్చారు. ప్రస్తుత ప్రధాని మోడీ ఇప్పటికే ఆరుసార్లు ప్రసంగించారు. .

భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చేసిన ప్రసంగంతో.. తొలి ప్రధాని నెహ్రూ రికార్డును అధిగమించారు మోడీ. ఎర్రకోట నుంచి చేసిన 94 నిముషాల సుదీర్ఘ ప్రసంగం ద్వారా 1947 లో అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన 72 నిముషాల ప్రసంగాన్ని మోడీ బద్దలుకొట్టారు. దేశ ప్రధానిగా ఎర్రకోట నుంచి చేసే ప్రసంగానికి ఏళ్లుగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తూ.. ప్రధానులు చేసే ప్రసంగాల కోసం.. ఇటు ప్రజలతో పాటు ఇతర దేశాలు కూడా అంతే ఆసక్తితో ఎదురుచూస్తుంటాయి. దేశాభివృద్ధి కోసం కేంద్రం చేపడుతోన్న పథకాలను, వాటి పనితీరును, పురోగతిని వివరిస్తూ ప్రధానులు తమ ప్రసంగం కొనసాగించడం ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ఇంతకుముందు వరకు ఇవే విషయాలను ప్రస్తావిస్తూ.. సుదీర్ఘ ప్రసంగాన్ని కొనసాగించారు ప్రధాని మోడీ.

74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ప్రధాని మోడీ ఏం మాట్లాడబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా తీవ్రత, చైనా కవ్వింపులపై ఎలాంటి సందేశం ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. అలాగే గత ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అవి ఎంతమేరకు అమలవుతున్నాయి..? ఎన్నికల హామీల్లో లేకపోయినా కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలేంటి? అన్న అంశాలతో కేంద్రం పనితీరుపై మోడీ వివరణ ఇచ్చే అవకాశముంది. మొత్తానికి ఎర్రకోటపై మోడీ ప్రసంగంపై ఆసక్తి రేపుతోంది.