Interest Rates : సామాన్యుడికి మోదీ ప్రభుత్వం మరో భారీ షాక్, వడ్డీ రేట్లు తగ్గింపు

మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటే ఇదేనేమో. దేశ ప్రజల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సామాన్యుడికి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఆర్థికంగా బాగా చితికిపోయాడు. అసలే అధిక ధరలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కరోనా విలయం తదితర ఇబ్బందులతో విలవిల్లాడుతున్న భారతీయులకు కేంద్రంలోని మోదీ సర్కార్ మరో భారీ షాక్ ఇచ్చింది.

Interest Rates : సామాన్యుడికి మోదీ ప్రభుత్వం మరో భారీ షాక్, వడ్డీ రేట్లు తగ్గింపు

Modi Govt Cuts Interest Rates

Modi Govt Cuts Interest Rates : మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటే ఇదేనేమో. దేశ ప్రజల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సామాన్యుడికి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఆర్థికంగా బాగా చితికిపోయాడు. అసలే అధిక ధరలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కరోనా విలయం తదితర ఇబ్బందులతో విలవిల్లాడుతున్న భారతీయులకు కేంద్రంలోని మోదీ సర్కార్ మరో భారీ షాక్ ఇచ్చింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు దాచుకునే వారికి చేదు వార్త చెప్పింది. ‘స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌’పై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం(మార్చి 31,2021) ప్రకటన చేసింది. ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి వర్తించనున్నాయి. జూన్‌ 30 వరకు ఈ వడ్డీ రేట్లు అమల్లో ఉంటాయి.

పొదుపు ఖాతా, పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్‌ వికాస్‌ పత్ర ఇలా అన్నింటిపైనా వడ్డీ రేట్లలో కోత విధించారు. కేంద్రం గత మూడు త్రైమాసికాల నుంచి వడ్డీ రేట్లను మార్చలేదు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసిక ప్రాతిపదికన చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను నోటిఫై చేస్తుంది. తాజాగా ఈ వడ్డీ రేట్లను సవరించింది.

వార్షిక డిపాజిట్లపై వడ్డీని 5.5 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గించారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్ఎఫ్) వడ్డీ రేటు 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించారు. పీపీఎఫ్ వడ్డీ రేటు 7 శాతం కంటే కిందకు రావడం గడిచిన 46 ఏళ్లల్లో ఇదే తొలిసారి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) వడ్డీ రేటును కూడా 6.8 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించారు.

ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పొదుపు పథకాలను కూడా కేంద్రం వదల్లేదు. సుకన్య సమృద్ధి యోజన పథకంపై వడ్డీ రేటును 7.6 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించారు. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించారు. గత ఏడాది కాలంలో మోదీ సర్కార్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండోసారి కావడం గమనార్హం

సేవింగ్స్‌ డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు మొదటిసారి 4శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది. ఏడాది టర్మ్‌ డిపాజిట్‌పై వడ్డీ రేటు 5.5% నుంచి 4.4 శాతానికి తగ్గింది. రెండేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పై వడ్డీని 5.5శాతం నుంచి 5.0 శాతానికి, మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పై వడ్డీని 5.5శాతం నుంచి 5.1 శాతానికి, ఐదేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పై వడ్డీని 6.7శాతం నుంచి 5.8 శాతానికి, ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌పై వడ్డీని 5.8% నుంచి 5.3 శాతానికి, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌పై వడ్డీని 7.4% నుంచి 6.5 శాతానికి, కిసాన్‌ వికాసపత్రపై 6.9 (124 నెలల్లో మెచ్యూరిటీ) శాతం నుంచి 6.2 (138 నెలల్లో మెచ్యూరిటీ) శాతానికి తగ్గించారు.

ప్రభుత్వ రాబడుల ఆధారంగా, ప్రతీ ఆర్థిక త్రైమాసికానికీ ప్రభుత్వం చిన్న మొత్తాల పెట్టుబడులపై వడ్డీ రేట్లను ప్రకటిస్తుంటుంది. కాగా, ఉద్యోగులు ఎక్కువగా ఈ చిన్నమొత్తాల పెట్టుబడులపై ఆసక్తి కనబరుస్తుంటారు. వీటిలో చాలా పెట్టుబడులకు ఆదాయపు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.