ఆయిల్ ధరలను కూడా ఆన్ లాక్ చేశారేమో… కేంద్రంపై రాహుల్ సెటైర్లు

10TV Telugu News

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ, ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి మోడీ సర్కార్ పై  విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం మహమ్మారి కరోనాకు, పెట్రోల్‌ డీజిల్‌ ధరలకు కూడా అన్‌లాక్‌ సడలింపులు ఇచ్చారేమోనని ట్విటర్‌ వేదికగా  రాహుల్ సెటైర్లు వేశారు. . 

అన్‌లాక్‌తో కరోనా కేసుల్లో పెరుగుదలే కాదు.. ఇంధన ధరలు కూడా భగ్గుమంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఇంధన ధరలు, కరోనా కేసుల పెరుగుదలను సూచించే ఓ గ్రాఫ్‌ను ఆయన షేర్‌ చేశారు. ఇక గాల్వాన్ వ్యాలీ  ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులవడం, ప్రధాని మోడీ  దేశంలోకి ఎవరూ చొరబడలేదన్న వ్యాఖ్యలపై కూడా రాహుల్‌ కేంద్రంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

గత 18 రోజులుగా దేశవ్యాప్తంగా డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన ధరాభారంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ 79.88 రూపాయలకు, డీజిల్‌ 79.40 రుపాయలకు లభ్యమవుతోంది. మొత్తంమీద లీటర్‌ పెట్రోల్‌పై 9.41రూపాయలు, డీజిల్‌పై 9.58 రూపాయలు మేర ధరలు అధికమయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు  ఇదే తీరు ఉంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 4.56 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో  దాదాపు  16 వేల పాజిటివ్‌ కేసులు,  450 మరణాలు నమోదయ్యాయి.

×