కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోడీ ఫొటో..ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోడీ ఫొటో..ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

vaccination certificate కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే డిజిటల్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ధ్రువీకరణ పత్రాల చివర్లో ప్రధాని నరేంద్రమోడీ ఫొటో,ఆయన ఇచ్చిన సందేశం ఉండటంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్,టీఎంసీ,ఎన్సీపీ వంటి పలు పార్టీలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ అధికార దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్ సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ ఆరోపించారు.

కరోనాపై జరిపిన పోరాటంలో తొలివరుసలో నిలిచిన వైద్య సిబ్బంది, టీకా తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తల కృషిని మోడీ పక్కన పెట్టేశారని డెరెక్ ఓబ్రెయిన్ విమర్శించారు. త్వరలో బెంగాల్ సహా పలు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ వ్యవహారంపై డెరక్ ఓబ్రెయిన్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఎన్నికల సమయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో మోడీ అనవసర ప్రచారం చేసుకోకుండా చూడాలంటూ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. మోడీ చిత్రం, ఆయన ఇచ్చిన సందేశంతో ఉన్న ధ్రువపత్రం చాలాకాలం నుంచి బెంగాల్‌లో చెలామణీలో ఉన్నట్లు తృణమూల్​ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో జనవరి-16నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ గ్రహీతలకు డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లభిస్తుంది.

అయితే, కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లపై ప్రధాని ఫొటో ఉండటాన్ని బీజేపీ సమర్థించుకోంటోంది. మోడీ దేశ ప్రధాని అని,ఆ హాదాలోనే ఆయన ఫొటో ఆ సర్టిఫికెట్ లో పెట్టబడిందని,ఆయన కరోనాని హ్యాండిల్ చేసిన విధానం, వ్యాక్సిన్ సరఫరాలో గానీ పీపీపీ కిట్లు లేదా ఇతర మెడిసిన్ల విషయంలోగానీ ఆయన ప్రపంచానికి భారత్ ను ఓ గొప్ప ఉదాహరణగా చూపిన విధానంచూసి మనం గర్వపడాలని బీజేపీ జాతీయ ప్రతినిధి ఆర్పీ సింగ్ అన్నారు.