మోడీనే కరోనావైరస్ “సూపర్ స్ప్రెడర్”..IMA ఉపాధ్యక్షుడు

దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తోన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మోడీనే కరోనావైరస్ “సూపర్ స్ప్రెడర్”..IMA ఉపాధ్యక్షుడు

Modi Is A Super Spreader Of Coronavirus Says Ima Vice President

Navjot Dahiya దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తోన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ మీడియా సైతం ఆయన వ్యవహారశైలిని..కరోనా సమయంలో మోడీ సర్కారు పని తీరును విమర్శిస్తున్నాయి. తాజాగా ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (IMA) ఉపాధ్య‌క్షుడు న‌వ‌జోత్‌ ద‌హియా మోడీని తీవ్రంగా విమర్శించారు.

దేశంలో కరోనా విజృంభ‌ణ‌కు మోడీనే ప్ర‌ధాని కార‌ణ‌మ‌ని ద‌హియా ఆరోపించారు. ప్ర‌ధాని మోడీని కరోనా వైరస్ ను ఎక్కువగా వ్యాప్తి చేసే “సూప‌ర్ స్ప్రెడ‌ర్‌” గా అభివ‌ర్ణించారు. అంత‌ర్జాతీయ మీడియా సైతం భార‌త్‌లో క‌రోనా విస్తృతికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, అత‌ని పాల‌నాయంత్రాంగ వైఫల్య‌మే కార‌ణ‌మ‌ని విమ‌ర్శిస్తున్న‌ద‌ని న‌వజోత్ ద‌హియా తెలిపారు. ఆక్సిజ‌న్ కొర‌తవ‌ల్ల ఇటీవ‌ల ఎంతో మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయార‌ని, ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌కు సంబంధించిన ప‌లు ప్రాజెక్టుల‌ను కేంద్రం పెండింగ్‌లో పెట్ట‌డంవ‌ల్లే ఈ ఘోరాలు జ‌రిగాయ‌న్నారు.

దేశంలో ఒక‌వైపు క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా ప్ర‌బ‌లుతుంటే ప్ర‌ధాని మాత్రం అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో ప్ర‌చార స‌భ‌లు నిర్వ‌హించార‌ని, కుంభ‌మేళాకు అనుమ‌తించార‌ని, అదే ప్ర‌స్తుత దుస్థితికి దారితీసింద‌ని ద‌హియా విమ‌ర్శించారు. ఓవైపు వైద్య రంగమంతా కొవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కలిగించే యత్నాలు చేస్తుంటే.. మరోవైపు ప్రధాని మోడీ మాత్రం భారీ బహిరంగ సభలు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడలేదని దహియా విమర్శించారు. ప్రధాని మోడీ కరోనా మార్గదర్శకాలన్నింటినీ గాలికొదిలేశారన్నారు.

గతేడాది జ‌న‌వ‌రిలో దేశంలో తొలి కరోనా కేసు న‌మోదైన‌ప్పుడు కూడా ప్ర‌ధాని నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని..వైర‌స్ క‌ట్ట‌డికి ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టాల్సింది పోయి, అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగ‌తం ప‌లుకడం కోసం గుజ‌రాత్‌లో ల‌క్ష మందికిపైగా జ‌నంతో భారీ స‌మావేశం ఏర్పాటు చేశార‌ని ద‌హియా విమ‌ర్శించారు. ఈ ఏడాది కాలంగా కూడా క‌రోనా క‌ట్ట‌డికి మోడీ ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవ‌డంలో ఆరోగ్య వ్య‌వ‌స్థ పూర్తి విఫ‌ల‌మ‌వుతున్న‌దని తెలిపారు.

కాగా, నిన్న మొన్నటి వరకూ ప్రపంచంలోని 78 దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపి జేజేలు అందుకున్న మోడీ సర్కారుకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రశంసల స్థానంలో విమర్శలు జోరుగా వస్తున్నాయి. కరోనా మొదటి విడతలో ఇండియాపై భారీగానే ప్రభావం చూపినా.. రెండో వేవ్ వస్తుందని నిపుణులు చెప్పినా.. కేంద్రం సరిగ్గా పట్టించుకోలేదన్న విమర్శలు ఇప్పుడు నరేంద్ర మోడీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.