శివకుమారస్వామి నిజమైన బసవేశ్వర భక్తుడు

  • Published By: venkaiahnaidu ,Published On : January 27, 2019 / 08:33 AM IST
శివకుమారస్వామి నిజమైన బసవేశ్వర భక్తుడు

మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం(జనవరి 27, 2019) 52వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2019లో తొలిసారిగా మోడీ మాట్లాడిన మన్ కీ బాత్ ఇదే కావడం విశేషం.ఈ సందర్భంగా ఇటీవల శివైక్యం చెందిన సిద్దగంగా మఠాథిపతి శివకుమార స్వామీజికి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి మోడీ నివాళులర్పించారు. శివకుమార స్వామి నిజమైన బసవేశ్వర భక్తుడని, ఆజన్మాంతం సమాజం కోసమే బతికారని, లక్షలాది మందికి విద్య, వైద్య, ఆర్థిక సమస్యలు తీర్చారని అన్నారు. 2017లో ఆయనను కలిసే అవకాశం వచ్చిందని, ఆ రోజును తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి అని మోడీ తెలిపారు. 

సుభాష్ చంద్రబోస్ పోరాట యోధులకు హీరో అని అన్నారు. స్వాతంత్ర్యపోరాటంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారని, వివిధ నినాదాలతో యువతలో స్ఫూర్తి రగిలించేవారని, అటువంటి మహనీయుడు దేశంలో జన్మించడం భారత ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు.

కలాంశాట్, రేడియో ప్రాముఖ్యం తదితర అంశాలపై ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. అంతరిక్షంలో పరిశోధనలు చేసే స్థాయికి ఈ రోజు మన దేశ యువత ఎదిగిందని, ఇది గర్వించదగ్గ సమయం అని తెలిపారు. దేశ ప్రజలు గర్వించదగ్గ కలాంశాట్ ను మన విద్యార్థులే తయారు చేసి ప్రారంభించారని తెలిపారు.

మన్ కీ బాత్ కార్యక్రమం రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదని మోడీ అన్నారు. దేశ ప్రజలతో కాసేపు ముచ్చటించాలన్నదే దీని ఉద్దేశమని తెలిపారు. ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని వినే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. రేడియో మారుమూల పల్లెలకు సైతం వినిపించగలదన్నారు. తన చిన్న తనంలో రేడియో ద్వారానే తాను అన్ని విషయాలు తెలుసుకొనే వాడినని తెలిపారు.