మోదీ సమీక్ష : సంక్రాంతి తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణ!

  • Published By: madhu ,Published On : December 22, 2019 / 01:35 AM IST
మోదీ సమీక్ష : సంక్రాంతి తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణ!

సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో జేడీయూ, అన్నాడీఎంకేలకు ప్రాతినిధ్యం లేదు. మంత్రివర్గంలో ఉన్న శివసేన ఎన్డీయే నుంచి వైదొలగింది. దీంతో మంత్రివర్గంలో మిత్రపక్షాలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశముంది.

కేంద్రంలోని మోదీ సర్కార్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని మొత్తం 56 మంత్రిత్వ శాఖలతోపాటు మంత్రుల పనితీరును సమీక్షించారు. సామాజిక రంగం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు.

 

అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని మోదీ మంత్రులను ఆదేశించారు.  ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, వారి ఆకాంక్షలను గౌరవించాలని కోరారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు, సాగు సహా వివిధ రంగాల విధానాలను రూపొందించాలని కోరారు. 

 

ఫిబ్రవరి 1న బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడంపైనా చర్చించినట్టు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్‌లో కొన్ని కీలకమైన జనాకర్షక పథకాలు ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండడంతో ఆ ప్రచారంపైనా ప్రధాని దృష్టి పెట్టారు. ఇవాళ రాంలీలా మైదానంలో జరిగే ర్యాలీలో మోదీ పాల్గొననున్నారు.

ముఖ్య పథకాల అమలు తీరు, మిషన్‌ 2022లో చేపట్టిన సంక్షేమ పథకాల అమలు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపైనా సమావేశంలో చర్చించారు.  ప్రతి ఇంటికీ తాగునీరు, అందరికీ ఇళ్లు, ఆయుష్మాన్‌ భారత్, టీకా కార్యక్రమంపై సమీక్షించారు. మంత్రుల నుంచి సలహాలు స్వీకరించడంతోపాటు ఆర్థిక మందగమనం, బడ్జెట్‌పైనా సమాలోచనలు సాగాయి.

ఇక దేశ వ్యాప్తంగా పౌరసత్వ చట్టంపై వెల్లువెత్తుతోన్న నిరసనలపైనా చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. దేశవ్యాప్తంగా పలు చోట్ల చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలను అదుపులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. 
Read More : పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా