Congress On Pegasus Spyware : అమిత్ షా రాజీనామా చేయాలి..మోదీపై విచారణ జరగాలి

సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ఓ జడ్జి, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు మంత్రులు, 40మంది పాత్రికేయుల సహా మొత్తం 300 మందికిపైగా ఫోన్లను పెగాసస్ స్పైవేర్​ హ్యాక్​ చేసినట్లు ఓ మీడియా సంస్థ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.

Congress On Pegasus Spyware : అమిత్ షా రాజీనామా చేయాలి..మోదీపై విచారణ జరగాలి

Congress On Pegasus Spyware

Congress On Pegasus Spyware   సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ఓ జడ్జి, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు మంత్రులు, 40మంది పాత్రికేయుల సహా మొత్తం 300 మందికిపైగా భారతీయుల ఫోన్లను పెగాసస్ స్పైవేర్​ హ్యాక్​ చేసినట్లు ఓ మీడియా సంస్థ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. మాజీ సీజేఐ రంజన్ గొగొయ్,మాజీ సీఈసీ అశోక్ లవాసా ఫోన్లు కూడా హ్యాకింగ్ కు గురైనట్లు కథనంలో పేర్కొంది. ఈ  కథనం ఇప్పుడు దేశంలో రాజకీయ దుమారం రేపుతోంది.

పెగాస‌స్ అనే స్పైవేర్‌తో రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్ర‌మేయం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆఖ‌రికి జ‌ర్న‌లిస్టులు, కేంద్ర మంత్రుల‌పై కూడా స్నూపింగ్ జ‌రుగుతుందని సోమవారం ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖ‌ర్గే ఆరోపించారు. పెగాసస్ స్పై వేర్‌కు సంబంధించిన ద‌ర్యాప్తున‌కు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా త‌న ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని ఖ‌ర్గే డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీపై కూడా పెగాస‌స్ ట్యాపింగ్ విష‌యంలో ద‌ర్యాప్తు జ‌రుగాల‌ని ఖ‌ర్గే అన్నారు.

తాను డిజిటల్ ఇండియాని ప్రమోట్ చేస్తున్నానని ప్రధాని మోదీ చెబుతుంటారని కానీ ఇప్పుడు మనం దానిని ఇప్పుడు నిఘా ఇండియా(surveillance India)గా చూస్తున్నామని లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఏ గ్రూప్.. తమ ఉత్పత్తులు ప్రత్యేకంగా క్రైమ్ మరియు ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రభుత్వాలు వినియోగిస్తున్నట్లు చెబుతోందని,అయితే మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లపై పెగాసస్ స్పైవేర్ ప్రయోగించి వారి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని చౌదరి తెలిపారు.

స్పైవేర్ పనితీరును మరియు ఇది ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలావివరిస్తూ.. మీ కుమార్తె లేదా మీ భార్య ఫోన్ లో పెగాసస్ ని చొప్పించవచ్చునని హెచ్చరించారు. మీరు వాష్‌రూమ్‌లో ఉన్నా, మీ పడకగదిలో … మీరు ఏ సంభాషణలో ఉన్నా, కుమార్తె, మీ భార్య, మీ కుటుంబం మాట్లాడుతుంటే మోడీ ప్రభుత్వం దానిపై నిఘా పెట్టగలదని సుర్జేవాలా తెలిపారు.  అంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ .. అందరి ఫోన్లలోని సమాచారాన్ని ఆయన చదివేస్తున్నారంటూ పరోక్షంగా ప్రధానిని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.

ఫోన్‌ హ్యాకింగ్‌ అంశంలో కేంద్రప్రభుత్వ పాత్ర ఉందంటూ వచ్చిన ఆరోపణలను ఇవాళ కేంద్రం ఖండించింది. భారతీయులపై నిఘా పెట్టడానికి పెగాసస్​ స్పైవేర్​ను ఉపయోగించినట్లు వచ్చిన మీడియా కథనాలను కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తోసిపుచ్చారు.ఆయా వార్తలన్నీ నిరాధారమైనవన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఫోన్‌ హ్యాకింగ్‌ అంశంపై కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయని ఇవాళ లోక్ సభలో ఐటీ మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో ప్రతి అంశానికి సంబంధించి కచ్చితమైన నియమనిబంధనలు ఉన్నాయని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. గతంలోనూ వాట్సాప్‌ను హ్యాక్‌ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయని అశ్వినీ వైష్ణవ్​ పేర్కొన్నారు.