Corona Vaccine పై మోడీ ఫోకస్, మూడు నగరాల్లో పర్యటన

  • Published By: madhu ,Published On : November 27, 2020 / 12:57 PM IST
Corona Vaccine పై మోడీ ఫోకస్, మూడు నగరాల్లో పర్యటన

Modi’s focus on corona vaccine : 10 నెలలకు పైగా ప్రాణాలు తీస్తున్న కోవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఫార్మా కంపెనీలు చేయని ప్రయత్నాలు లేవు. ఇంతవరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. కానీ.. ప్రయోగాలు ఆశాజనక ఫలితాలనిస్తున్నాయన్న వార్తలు ప్రజల్లో మనోధైర్యాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్పత్తి, నిల్వ సామర్థ్యం, పంపిణీపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే.. 2020, నవంబర్ 28వ తేదీ శనివారం ప్రధాని మోదీ మూడు నగరాలను చుట్టేయనున్నారు.



అహ్మదాబాద్, పూణె, హైదరాబాద్
భారతీయులకు అతి తక్కువ ఖర్చుతో టీకాను అందుబాటులోకి తేవాలని భావిస్తున్న మోదీ.. అహ్మదాబాద్‌, పూణె, హైదరాబాద్‌ నగరాల్లో శనివారం పర్యటించనున్నారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ముందున్న మూడు కంపెనీల ప్లాంట్‌లను సందర్శిస్తారు. వాటి పనితీరుపై వైద్య శాస్త్రవేత్తలతో చర్చిస్తారు. టీకా తయారీ స్థితిగతులను తెలుసుకుంటారు. ఉత్పత్తి సామర్థ్యంపై ఆరా తీస్తారు. వ్యాక్సిన్‌ నిల్వ., రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు., సక్రమ పంపిణీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫార్మా కంపెనీల ప్రతినిధులు, అధికారులతో చర్చించనున్నారు.



https://10tv.in/aap-govts-nod-to-use-9-stadiums-as-temporary-jails/
అహ్మదాబాద్
28వ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు.. తొలుత అహ్మదాబాద్‌ శివార్లలోని జైడూస్ బయోటెక్‌ పార్క్‌కు వెళతారు ప్రధాని. అక్కడ తయారవుతున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ జైకోవ్‌-డీ పనితీరు, ఉత్పత్తి సామర్థ్యంపై ఆరా తీస్తారు. మార్చికల్లా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే జైడస్ క్యాడిలా ప్రతినిధులు ప్రకటించారు. ఈ కంపెనీ మూడో దశ పరీక్షలను డిసెంబర్‌లో చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అన్ని పరీక్షలు విజయవంతమైతే 10 కోట్ల డోసేజీల తయారీని చేపట్టనుంది.



మధ్యాహ్నం పూణె
అహ్మదాబాద్‌ నుంచి 28వ తేదీ శనివారం మధ్యాహ్నానికి పూణె చేరుకుంటారు ప్రధాని మోదీ. పూణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అభివృద్ధి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ – ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌నూ పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు.. పూణె నుంచి హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకుంటారు.



సాయంత్రం హైదరాబాద్
రోడ్డుమార్గంలో జీనోమ్‌ వ్యాలీకి చేరుకుని భారత్‌ బయోటెక్‌ను సందర్శిస్తారు ప్రధాని మోదీ. శనివారం సాయంత్రం 4 గంటల 10 నిమిషాల నుంచి గంట పాటు భారత్‌ బయోటెక్‌లోనే ఉండనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు హకీంపేట నుంచి ఢిల్లీకి బయల్దేరతారు.



ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామ్యంలో
ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామ్యంలో… ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తెస్తోంది. పూణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ అందించిన కరోనావైరస్‌ స్ట్రెయిన్‌తో టీకాను తెస్తోంది భారత్‌ బయోటెక్‌. కోవాగ్జిన్‌కు ఇప్పటికే రెండు దశల పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు టీకా 60 శాతం పైగానే ఆశాజనక ఫలితాలిచ్చింది. ఇటీవలే మూడో దశ ట్రయల్స్‌ చేపట్టారు. కొవాగ్జిన్‌ తయారీ, సామర్థ్యం, ఉత్పత్తి, పంపిణీపై కంపెనీ ప్రతినిధులతో ప్రధాని చర్చిస్తారు.



శీతలగాలులు
భారత్‌లో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. శీతగాలికి వైరస్ మరింతగా విజృంభిస్తుందని హెచ్చరికలున్నాయి. కరోనావైర్‌స్‌పై పోరులో నిర్లక్ష్యం వహించవద్దని మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో ప్రధాని హెచ్చరించారు. త్వరగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే కరోనాను కట్టడి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే యుద్ధప్రాతిపదికన పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై చర్యలు చేపడుతోంది. వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలనే దాని పైనా కసరత్తు చేస్తోంది. వ్యాక్సిన్‌ పంపిణీకి దిశానిర్దేశాలను సూచిస్తూ.. పలు రాష్ట్రాలకు లేఖలూ రాసింది. పంపిణీలో అక్రమాలు జరగకుండా చూడాలని ఆదేశించింది.