యూపీలో డాక్టర్లు,హెల్త్ సిబ్బందిపై రాళ్ల దాడి…17మంది అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : April 16, 2020 / 07:26 AM IST
యూపీలో డాక్టర్లు,హెల్త్ సిబ్బందిపై రాళ్ల దాడి…17మంది అరెస్ట్

కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న డాక్టర్లు,పోలీసులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, కరోనా పరీక్షలు నిర్వహించే వైద్య సిబ్బందిపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయి. బుధవారం యూపీలోని మొరాదాబాద్ లో కరోనా వైరస్ చెకప్ కోసం వెళ్లిన డాక్టర్లు,హెల్త్ సిబ్బంది,పోలీసులపై దాడి కేసులో 17మందిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోని నవాబ్ పురా ఏరియాలోని ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు సమాచారం అందడంతో వైద్య సిబ్బంది, పోలీసులు అక్కడికి వెళ్లారు. కరోనా అనుమానితులను అంబులెన్స్‌లో ఎక్కించిన తర్వాత ఆస్పత్రికి వెళ్లే క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున గుమిగూడి ఇటుకలు, రాళ్లతో దాడిచేశారు. ఏప్రిల్-13న ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తి కరోనావైరస్‌తో చనిపోయాడు. అప్రమత్తమైన వైద్యాధికారులు మృతుడి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ సెంటర్‌కు తరలించాలనుకున్నారు.

ఈ క్రమంలోనే వారిని క్వారంటైన్ సెంటర్‌కు తీసుకెళ్తుండగా దాదాపు 200మంది స్థానికులు హెల్త్ సిబ్బంది,పోలీసులపై దాడి చేశారు. కొందరు స్థానికులు తమ ఇళ్లపైకి ఎక్కి హెల్త్ వర్కర్లపై,పోలీసులపై రాళ్లు విసిరారు. కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు వైద్య సిబ్బందికి గాయాలయ్యాయి. అంబులెన్స్, పోలీస్ వాహనం అందాలు ధ్వంసమయ్యాయి. దాంతో ప్రాణాలు అరచేత పట్టుకొని సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందితే చెందనివ్వండి..కానీ మేము మాత్రం మాకు మేముగా టెస్ట్ లకు అనుమతించం అంటూ దాడికి పాల్పడుతున్న సమయంలో దుండగులు పెద్ద పెద్దగా అరుస్తున్నట్లు దాడికి గురైన హెల్త్ సిబ్బంది తెలిపారు. దాడికి సంబంధించి 17మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వారిపై FIR నమోదుచేశారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు  అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. యూపీలో డాక్టర్లపై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఘజియాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. డాక్టర్లు,హెల్త్ సిబ్బందిపై ఇలా దాడులకు పాల్పడుతున్నవారిపై NSA(జాతీయ భద్రతా చట్టం)కింద కేసులు నమోదుచేయాలని ఇటీవల సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రజల్లోకి వచ్చిన డాక్టర్లపై పోలీసులపై దాడి చేయడం అమానుషమని నటుడు సల్మాన్ ఖాన్ ఓ వీడియోను విడుదల చేసాడు. మనం ఎవరిపై దాడులు చేస్తున్నాం. మీరు ప్రభుత్వానికి సహకరిస్తే.. లాక్‌డౌన్ తొందరగా ముగుస్తుంది. లేకపోతే చాలా మంది ఆకలితో అలమటిస్తారు.మన సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. పోలీసులకు,ప్రభుత్వాలకు సహకరించని వాళ్లకు వాళ్ల స్టైల్లోనే ట్రీట్‌మెంట్ ఇవ్వాలని సల్మాన్ కోరాడు.(కరోనా ఎఫెక్ట్, ఈ ఏడాది ఐపీఎల్ కథ ముగిసినట్టే)