కరోనా రోగుల్లో ఎక్కువమంది ఇళ్లలోనే కోలుకుంటున్నారు, 10వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయి, సీఎం ట్వీట్

  • Published By: naveen ,Published On : July 5, 2020 / 12:08 PM IST
కరోనా రోగుల్లో ఎక్కువమంది ఇళ్లలోనే కోలుకుంటున్నారు, 10వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయి, సీఎం ట్వీట్

ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య, కోలుకుంటున్న వారి సంఖ్యపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ట్వీట్ చేశారు. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందనే వార్తలు వస్తున్న వేళ కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై ఆయన ట్వీట్ చేశారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగతోందని ఆదివారం(జూలై 5,2020) సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స అవసరమవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోందన్నారు. చాలామంది ఇళ్లలోనే కోలుకుంటున్నారని చెప్పారు. గత వారం రోజుకి సగటున 2వేల 300 కేసులు నమోదైనప్పటికీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య మాత్రం 6వేల 200 నుంచి 5వేల 300కు తగ్గిందన్నారు. కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 10 వేల పడకలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని సీఎం చెప్పారు.

70శాతానికి చేరిన రికవరీ రేటు:
ఢిల్లీలో శనివారం(జూలై 4,2020) కొత్తగా 2వేల 505 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97వేల 200కు చేరింది. నిన్న ఒక్కరోజే 2వేల 500 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 68వేల 256కు చేరింది. ఢిల్లీలో రికవరీ రేటు దాదాపు 70 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా కరోనా కట్టడిలో ముందున్న వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు సహా ఇతర అత్యవసర సేవలకు చెందిన వారిని కేజ్రీవాల్ అభినందించారు.

24 గంటల్లో 24వేలకు పైగా కరోనా కేసులు:
కాగా, దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చింది. గ‌త వారం రోజులుగా భార‌త్‌లో నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 4,2020) ఒక్క‌రోజే అత్య‌ధికంగా 24వేల 850 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. కేసులే కాదు పెరుగుతున్న మరణాల సంఖ్యా ఆందోళన కలిగిస్తోంది. శ‌నివారం ఒక్క‌రోజే దేశంలో 613 మంది కరోనాతో చనిపోయారు. దేశ‌వ్యాప్తంగా ఒక్క‌రోజు గ‌డువులో ఈ స్థాయిలో మ‌ర‌ణాలు, కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. దీంతో ఆదివారం(జూల్ 5,2020) నాటికి దేశంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 6లక్షల 73వేల 165గా చేరింది. ఇప్ప‌టివర‌కు 19వేల 268మంది మరణించారు. కరోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 4ల‌క్ష‌ల దాట‌డం కాస్త ఊర‌ట క‌లిగించే విష‌యం. 2లక్షల 44వేల 814మంది ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. దేశ‌వ్యాప్తంగా నిన్న ఒక్క‌రోజే దాదాపు 15వేల మంది కోలుకొని డిశ్చార్జి అయిన‌ట్లు ప్ర‌భుత్వం ప్రకటించింది. క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 60శాతంగా ఉండ‌గా మ‌ర‌ణాల రేటు 2.9శాతంగా ఉంది.

కరోనా కేసుల్లో ప్ర‌పంచంలో మూడో స్థానానికి చేరువలో భార‌త్‌:
శరవేగంగా పెరుగుతున్న క‌రోనా కేసుల‌తో భార‌త్ ప్ర‌పంచంలోనే మూడో స్థానానికి చేరువైంది. తాజాగా కేసుల సంఖ్య 6లక్షల 73వేల 165కు చేర‌డంతో ర‌ష్యా(6,‌73,564‌) కు దగ్గరగా ఉంది. ప్ర‌స్తుతం 28ల‌క్ష‌ల పాజిటివ్ కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండ‌గా, 15ల‌క్ష‌ల కేసుల‌తో బ్రెజిల్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. తొలి స్థానంలో ఉన్న అమెరికా మిన‌హా, బ్రెజిల్‌, ర‌ష్యాల‌లో నిత్యం దాదాపు 7వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌గా భార‌త్‌లో మాత్రం ఆ సంఖ్య 25వేలకు చేరువ కావడం ఆందోళ‌న క‌లిగిస్తోంది.