Randeep Guleria : కరోనా బాధితులందరికీ ఆసుపత్రులు, ఆక్సిజన్ అవసరం లేదు.. రెమ్‌డిసివిర్‌‌తో ప్రయోజనం లేదు… సాధారణ మందులతో ఇంట్లోనే నయమవుతుంది

కరోనా బాధితులు అందరికీ ఆసుపత్రులు, మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉందా? రెమిడెసివిర్ డ్రగ్ తో ప్రయోజనం ఉందా? సాధారణ మందులతో ఇంట్లోనే కరోనా నయం అవుతుందా? మాస్కు వేసుకుంటే కరోనా రాదా? నిపుణులు ఏమంటున్నారు?

Randeep Guleria : కరోనా బాధితులందరికీ ఆసుపత్రులు, ఆక్సిజన్ అవసరం లేదు.. రెమ్‌డిసివిర్‌‌తో ప్రయోజనం లేదు… సాధారణ మందులతో ఇంట్లోనే నయమవుతుంది

Randeep Guleria

Randeep Guleria : కరోనావైరస్ మహమ్మారి భయంతో దేశ ప్రజలంతా వణికిపోతున్నారు. జ్వరం వచ్చినా జలుబు వచ్చినా కరోనా ఏమో అనుమానంతో భయపడుతున్నారు. వెంటనే ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ఆక్సిజన్ కావాలంటున్నారు. రెమ్ డిసివిర్ డ్రగ్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగింది. తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడింది. డాక్టర్లపై తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.

corona

ఈ క్రమంలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా బాధితులందరికీ ఆసుపత్రుల అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. 85% మందికి సాధారణ మందులతోనే వైరస్‌ తగ్గిపోతుందని, మిగతా 15% మంది వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆసుపత్రులకు రావడం మేలని ఆయన సూచించారు. పాజిటివ్‌ వచ్చిన వారందరికీ ఆసుపత్రుల్లోనే చికిత్స అందించడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.

Covid-19

‘‘చాలామందిలో అనవసర భయాందోళనలు నెలకొన్నాయి. పాజిటివ్‌ వచ్చినా లక్షణాలు లేనివారు, ఆక్సిజన్‌ స్థాయులు సక్రమంగానే ఉన్నవారు మున్ముందు ఇబ్బంది పడకూడదని ఆసుపత్రులకు వెళ్తే… అక్కడ రద్దీ పెరుగుతుంది. చికిత్స అవసరమైనవారు ఇబ్బందిపడాల్సి వస్తుంది. భయాందోళనలతో ఇంట్లో మందులు నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్లో కొరత ఏర్పడుతుంది. తొలిరోజు నుంచే మందులన్నీ వాడితే మున్ముందు సీరియస్‌ కాదనుకుంటారు. దానివల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి.

Corona patients

ప్రాణవాయువును దుర్వినియోగం చేస్తున్నారు:
మొదటిరోజు నుంచే ఆక్సిజన్‌ పెట్టుకుంటే మున్ముందు దాని అవసరం రాదన్న ఉద్దేశంతో కొందరు ఇంట్లోనే సిలిండర్లు పెట్టుకొని అనవసరంగా వాడుతున్నారు. ఇది మంచి అలవాటు కాదు. 94పైన ఆక్సిజన్‌ స్థాయి ఉంటే అన్ని అవయవాలకూ ప్రాణవాయువు అందుతోందని లెక్క. కాబట్టి ఆందోళన అవసరం లేదు. 94-95 స్థాయిలో ఆక్సిజన్‌ ఉన్నవారు కృత్రిమంగా ఆక్సిజన్‌ పెట్టుకుని దాన్ని 97-98 స్థాయికి తీసుకెళ్లాలనుకోవడం సరికాదు. ప్రాణవాయువును దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఆక్సిజన్‌ స్థాయిని నిత్యం 95పైన ఉంచాలనుకోవద్దు. 92, 93 స్థాయిలో ఉన్నా, ఇబ్బందులేమీ రావు” అని గులేరియా చెప్పారు.

oxygen

బోర్లా పడుకుంటే సరిపోతుంది:
సిలిండర్లు పెట్టుకున్న వారు భోజన సమయంలో మాస్కు పక్కనపెట్టి, అలాగే వదిలేస్తున్నారు. ఆ సమయంలో ఆక్సిజన్‌ను బంద్‌ చేయకపోవడం వల్ల వృథా అవుతోంది. ప్రాణవాయువును న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలి. ఇంట్లో ఉన్నవాళ్లు ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉందని అనిపించినప్పుడు బోర్లా పడుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి ప్రాణవాయువు స్థాయి పెరుగుతుంది.

రెమ్‌డిసివిర్‌తో ప్రయోజనాలు లేవు:
కరోనా రోగులంతా డిమాండ్ చేస్తున్న డ్రగ్ రెమ్ డిసివిర్. కరోనా రోగుల చికిత్సలో దీన్ని వాడతారు. ఈ ఇంజక్షన్ ఇస్తే వైరల్ లోడ్ గణనీయంగా తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో ఈ డ్రగ్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ ను కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. కాగా,
రెమ్‌డెసివిర్‌ వల్ల పెద్దగా ప్రయోజనాలేమీ లేవని గులేరియా చెప్పారు. చైనా, అమెరికా, డబ్ల్యూహెచ్‌వోలు నిర్వహించిన అధ్యయనాల్లో సానుకూల ఫలితాలు రాలేదన్నారు. రెమ్‌డెసివిర్‌ దొరక్కపోతే భయాందోళనలు అక్కర్లేదని చెప్పారు.

అందరికీ ఆసుపత్రులు.. ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదు:
కరోనా సోకిన 85% మందిలో తేలికపాటి లక్షణాలే ఉంటున్నాయన్నారు. దగ్గు, జర్వం, జలుబుకే లక్షణాలు పరిమితమవుతాయన్నారు. సాధారణ మందులతో అవి క్రమంగా తగ్గిపోతాయని తెలిపారు. ఆక్సిజన్‌ స్థాయి తగ్గి, జ్వరం తీవ్రమై… నీరసం, మగత, తీవ్రంగా వాంతులు అవుతుంటే అప్పుడు ఆసుపత్రిలో చేరే విషయమై నిర్ణయం తీసుకోవాలన్నారు. భయాందోళనల కారణంగా ఇంట్లో ఉండకుండా అందరూ ఆసుపత్రుల్లో చేరతామంటే అంతమందికి సేవలందించే స్థాయి ప్రపంచంలోని ఏ మౌలిక వసతుల వ్యవస్థకూ లేదని గులేరియా అన్నారు. కేసులు తగ్గాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.

WEAR MASK AT HOME

ఇంట్లో ఉన్నా మాస్కు ధరించాలి:
మహిళలు నెలసరి సమయంలోనూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. ‘‘రెండు వ్యాక్సిన్లు చాలా బాగా పనిచేస్తున్నాయి. అందువల్ల దొరికింది తీసుకోవాలి. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నవారు ఐవర్‌మెక్టిన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ఐదు రోజులకు మించి దగ్గు ఉంటే బ్యుడెనెసైట్‌ తీసుకోవచ్చు. అవసరమైన వారికి మాత్రమే పడకలు ఉపయోగపడేలా చూడాలి. లేకపోతే డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో ఉన్నా, అందరూ మాస్కులు ధరించడం మేలు. పాజిటివ్‌ వచ్చినవారిని ఇంట్లో ఏకాంతంగా ఉంచే పరిస్థితి లేకుంటే బయట కేంద్రాలకు పంపండి. ఆసుపత్రుల కోసం చూడొద్దు’’ అని ఆయన సూచించారు.

మాస్కులు ధరించకుంటే 90% ముప్పు:
మాస్కు ధరించకుండా ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా మాట్లాడుకుంటే… వైరస్‌ సోకే ముప్పు 90% ఉంటుందని వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ హెచ్చరించారు. ఇద్దరూ మాస్కులను సక్రమంగా ధరిస్తే వైరస్‌ నుంచి చాలావరకు రక్షణ లభిస్తుందన్నారు. ‘‘భౌతికదూరం పాటించకుంటే… ఇన్‌ఫెక్షన్‌ సోకిన ఒక్క వ్యక్తి నుంచి నెలలో 406 మందికి వైరస్‌ సోకుతుంది. అదే 50% భౌతిక దూరం పాటిస్తే… 15కి, 75% భౌతిక దూరంతో 2.5కి బాధితుల సంఖ్య పరిమితమవుతుంది’’ అని ఆయన వివరించారు.