అమ్మ ఆఖరి మాట : జగన్నాథుడికి రూ.కోటి విలువైన ఆస్తుల విరాళం

అమ్మ ఆఖరి మాట : జగన్నాథుడికి రూ.కోటి విలువైన ఆస్తుల విరాళం

Mother Wish: తల్లిదండ్రుల ఆస్తుల కోసం కొట్లాడే వాళ్లు..చంపేసే వాళ్లు ఉండడం చూస్తుంటాం. కానీ..తల్లి చివరి కోరిక కోసం ఏకంగా రూ. కోటి విలువ చేసే ఆస్తులను భగవంతుడికి విరాళం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. జగన్నాథ మందిరానికి విరాళంగా ఇచ్చిన ముగ్గురు కూతుళ్లు తోటి వారికి ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. నవరంగపూర్ పట్టణంలో భగవతీ వీధికి చెందిన భవానీ సాహు సతీమణి వైజయంతి మాల సాహు జగన్నాథుని భక్తురాలు.

ఈమెకు ముగ్గురు కుమార్తెలు (పుష్పాంజలి సాహు, గీతాంజళి శతపతి, శ్రద్ధాంజలి పండ)లు. కొడుకులు లేరు. జగన్నాథుడే తన కుమారుడిని భావించేదని కుటుంసభ్యులు వెల్లడించారు. ఇదే కారణంతో..తన పేరిట ఉన్న ఆస్తిని జగన్నాథునికి అర్పించాలని కుమార్తెలకు చెప్పేదట. ఆమె పేరిట నవరంగపూర్‌ భగవతీ వీధిలో 25 గదులతో గల మూడంతస్తుల భవనం ఉండేది. ఈ భవనంలో ప్రస్తుతం 9 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి.

ఇదిలా ఉంటే..అనారోగ్యంతో వైజయంతీమాల 2020, డిసెంబర్ 02వ తేదీన కన్నుమూసింది. మృతికి ముందే జగన్నాథుపై తన విశ్వాసాన్ని చాటుకుంటూ..ఆస్తిని నవరంగపూర్‌లోని జగన్నాథ మందిరానికి అప్పగించాలని కోరింది. తల్లి చివరి కోరిక తీర్చాలని ఆ ముగ్గురు కుమార్తెలు నిర్ణయించారు. మూడంతస్తుల భవనాన్ని నవరంగపూర్ జగన్నాథ మందిరానికి విరాళంగా అందచేశారు. అలాగే ఆమె బంగారు, వెండి ఆభరణాలను నవరంగపూర్ నీలకంఠేశ్వర ఆలయంలోని పార్వతీదేవి మందిరానికి దానం చేశారు. ఆమె కోర్కెను తీర్చేందుకు గర్విస్తున్నామని కుటుంబసభ్యులు వెల్లడించారు.