ఆస్తులు అమ్ముకోవాలి : ట్రాక్టర్ కు రూ.59 వేలు, ఆటోకి రూ.47 వేల ఫైన్

  • Published By: madhu ,Published On : September 5, 2019 / 10:55 AM IST
ఆస్తులు అమ్ముకోవాలి : ట్రాక్టర్ కు రూ.59 వేలు, ఆటోకి రూ.47 వేల ఫైన్

కొత్త మోటారు వాహనాల చట్టం 2019తో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. 2019, సెప్టెంబర్ ఒకటి నుంచి అమలులోకి వచ్చిన రూల్స్ తో దేశం గగ్గోలు పెడుతోంది. బండ్లు తీయాలంటే వణికిపోతున్నారు వాహనదారులు. భారీ చాలన్లతో ట్రాఫిక్ పోలీసులు హడలెత్తిస్తున్నారు. హర్యానా గురుగ్రామ్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన ట్రాక్టర్ కు రూ.59 వేల ఫైన్ వేశారు. కలలో కూడా ఊహించని ఈ జరిమానా కట్టాలంటే ట్రాక్టర్ అమ్ముకోవాల్సిందే అంటున్నాడు యజమాని.

మొత్తం 10 రూల్స్ బ్రేక్ చేశాడంట ట్రాక్టర్ డ్రైవర్. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ లేదు. ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు. ప్రమాదకర వస్తువుల రవాణా, ప్రమాదకర డ్రైవింగ్, పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయటం ఇవన్నీ కూడా ఆ ట్రాక్టర్ చేసింది. వీటి కింద మొత్తంగా లెక్కకడితే 59వేలు వచ్చిందంట. చలానా చేతికి ఇచ్చారు పోలీసులు.

ఒడిషా భువనేశ్వర్ లో హరిబంధు అనే ఆటోవాలాకు రూ. 47వేల 500 జరిమానా విధించారు. మందు కొట్టి నడిపినందుకు రూ. 10 వేలు, హారన్ ఇష్టానుసారం కొట్టినందుకు రూ.10 వేలు, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ లేనందుకు రూ.5 వేలు, పర్మిట్ లేనందుకు రూ.10 వేలు, ఇతర ఉల్లంఘనల కింద రూ.12 వేల 500 జరిమానా విధించారు. మొత్తం రూ. 47 వేల 500. సెకెండ్ హ్యాండ్ లో 26 వేలకు ఇతను ఆటో కొన్నాడు. ఇప్పుడు 47వేల ఫైన్. జరిమానా కట్టి ఆటో తీసుకోవాలా లేక మరో 23 వేల రూపాయలతో ఇంకో సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కోవాలా అనే డైలమాలో పడ్డారు ఆటోవాలా. మొత్తానికి ట్రాఫిక్ చలాన్లు కట్టాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చేట్లు ఉన్నారు వాహనదారులు.