మధ్యప్రదేశ్ స్పీకర్ ను కలిసిన బీజేపీ నాయకులు…19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా లేఖ సమర్పణ

10TV Telugu News

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న గోపాల్ భార్గవ,నరోత్తమ్ మిశ్రాలు ఇవాళ(మార్చి-10,2020) మరికొందరు బీజేపీ నాయకులతో కలిసి భోపాల్ లో అసెంబ్లీ స్సీకర్ నివాసానికి వెళ్లారు. స్పీకర్ ఎన్ పీ ప్రజాపతిని కలిశారు. 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల లేఖలను గోపాల్ భార్గవ స్పీకర్ కు అందజేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరూ బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్ లో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ ప్రొసీజర్ ప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయని స్పీకర్ ప్రజాపతి మీడియాకు తెలిపారు.

బెంగళూరులో ఉండి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు భద్రత,పోలీస్ ఎస్కార్ట్ డిమాండ్ చేస్తూ కర్ణాటక డీజీపీకి లేఖ రాశారు. కర్ణాటకకు తాము స్వచ్ఛందంగా ఓ ముఖ్యమైన పనిమీద వచ్చామని, దీనికి సంబంధించి తాము బెంగళూరులో,బెంగళూరు చుట్టపక్కల ప్రాంతాల్లో సురక్షితంగా ఉండేందుకు,తిరిగేందుకు తమకు భద్రత కల్పించాలని ఆ లేఖలో వారు డీజీపీని కోరారు.

	C_0.JPG

అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేసేందుకు మరికొందరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని,రాజీనామా ఎమ్మెల్యేల సంఖ్య 30కు చేరుకునే అవకాశముందని బీజేపీ నాయకుడు భూపేంద్ర సింగ్ తెలిపారు. చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు ఆశక్తి కనబరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఇప్పటివరకు కమల్ నాథ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఓ ఎస్పీ ఎమ్మెల్యే,ఓ బీఎస్పీ ఎమ్మెల్యే ఇవాళ భోపాల్ లో మాజీ సీఎం,బీజేపీ సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ని కలిశారు.  కాంగ్రెస్ ముఖ్య నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీకి జై కొట్టడంతో మధ్యప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ప్రస్తుతం చాలా వేడిగా ఉంది. కర్ణాటకలో మాదిరిగా కుదిరితే త్వరలోనే మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం సృష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు ఇవాళ రాత్రికి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అయితే సీఎం కమల్ నాథ్ కాషాయదళానికి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నాడని కాంగ్రెస్ నాయకుడు పీసీ శర్మ తెలిపారు. త్వరలోనే మధ్యప్రదేశ్ లో నెంబర్స్ మారుతాయని ఆయన తెలిపారు.