వెంటిలేటర్ పై మధ్యప్రదేశ్ గవర్నర్

  • Published By: venkaiahnaidu ,Published On : July 16, 2020 / 09:28 PM IST
వెంటిలేటర్ పై మధ్యప్రదేశ్ గవర్నర్

మ‌రోసారి మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ లాల్జీ టాండ‌న్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ‌స‌భ్యులు ఆయ‌న‌ను ల‌క్నోలోని మెదంతా హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై ఉన్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయం స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో లాల్జీ ఆరోగ్యం మ‌రింత విష‌మంగా మారింద‌ని మెదంటా హాస్పిట‌ల్ డాక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. లాల్జీ ఆరోగ్యం విష‌మంగా ఉంద‌ని ప్ర‌స్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొందుతున్న‌ట్లు పేర్కొన్నారు.

10 రోజుల పాటు స్వస్థలంలో గడిపేందుకు జూన్‌ 9న లక్నోకు వెళ్లారు మధ్యప్రదేశ్ గవర్నర్. అయితే యూరినేషన్ లో ఇబ్బందులతో అయన జూన్‌ 11న ల‌క్నోలోని మెదంటా ఆస్పత్రిలో చేరారు. వెంటిలేట‌ర్‌పై చికిత్స అందించ‌గా కొన్ని రోజుల క్రిత‌మే లాల్జీ ఆరోగ్యం మెరుగుప‌డి డిశ్చార్జ్ అయ్యారు. మ‌రోసారి ఆయ‌న ఆరోగ్యం విష‌మంగా మార‌డంతో కుటుంబ‌ సభ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మంగళవారం(జులై-15,2020)ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేదాంత హాస్పిటల్ కి వెళ్లి లాల్జీని పరామర్శించారు. అయన ఆరోగ్య పరిస్థితి గురుంచి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు యోగి.

లాల్జీ టాండ‌న్ ఆరోగ్యం క్షీణించడంతో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌కు అదనంగా మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ బాధ్యతలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అప్పగించిన విషయం తెలిసిందే.