కామాఖ్య ఆలయానికి అంబానీ Diwali గిఫ్ట్.. 19కిలోల బంగారంతో అలంకరణ

  • Published By: sreehari ,Published On : November 7, 2020 / 12:45 PM IST
కామాఖ్య ఆలయానికి అంబానీ Diwali గిఫ్ట్.. 19కిలోల బంగారంతో అలంకరణ

Kamakhya Temple : భారతదేశంలోని అత్యంత అరుదైన శక్తిపీఠాల్లో ఒకటి కామాఖ్య ఆలయం. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కామాఖ్య ఆలయాన్ని దీపావళిని సందర్భంగా అందంగా అలంకరిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖేశ్ అంబానీ దీపావళి పర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై ఉన్న మూడు కలశాలకు 19కిలోల బంగారంతో అందంగా అలంకరిస్తున్నారు.



హిందు పుణ్యక్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన కామాఖ్య దేవాలయాన్ని కరోనా మహమ్మారి కారణంగా కొన్నాళ్లు మూసివేశారు. అనంతరం అక్టోబర్ 12 ఆలయం తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. అప్పటినుంచి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. దీపావళి సందర్భంగా ముంబైకి చెందిన స్థానిక శిల్పకారులతో అమ్మవారి దేవాలయ అలంకరణ పనులు కొనసాగుతున్నాయి.



ఈ దేవాలయ ప్రాజెక్టుపై ముఖేశ్ అంబానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అన్ని పనులకు దగ్గరుండి చూసుకుంటున్నారు. అమ్మవారి ఆలయానికి 19 కిలోల బంగారాన్ని అంబానీ దీపావళి గిఫ్ట్‌గా అందించారు. దేవాలయ గోపురంపై మూడు కలషాల చుట్టూ బంగారం తాపడం పనులు జరుగుతున్నాయి.

త్వరలోనే ఈ అలంకరణ పనులు పూర్తికానున్నాయి. వచ్చే రెండు వారాల్లో మిగిలిన పనులు కూడా పూర్తవుతాయని నివేదిక పేర్కొంది. ఆలయ ప్రధాన నిర్మాణం కోసం కాపర్ ఫ్రేమ్ డిజైన్ సిద్ధం చేస్తున్నారు. అలాగే గోల్డ్ లీఫింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి.



అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలో గువాహటి పట్టణంలో కామగిరి అని పిలిచే నీలాచల్ కొండపై ఈ ఆలయం ఉంది. ప్రతి ఏటా కామాఖ్య దేవాలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశ విదేశాల నుంచి ఈ ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు వస్తుంటారు.