నిసర్గ తుఫాన్…ఊపిరి పీల్చుకున్న ముంబై

  • Published By: venkaiahnaidu ,Published On : June 3, 2020 / 01:34 PM IST
నిసర్గ తుఫాన్…ఊపిరి పీల్చుకున్న ముంబై

తీవ్రమైన  నిసర్గ తుఫాన్ ప్రభావం నుంచి ముంబై నగరం తప్పించుకుంది. ముంబైలో వర్షం కురవడం తగ్గింది. అంతేకాకుండా గాలుల వేగం కూడా పూర్తిగా తగ్గింది. ఇప్పటివరకు ముంబలో తుపాన్ కారణంగా ఏ విధమైన నష్టం జరిగిందన్నది ఇంకా తెలియరాలేదు. పెద్దగా ఆస్తినష్టం లేదని మాత్రం అర్థమవుతోంది. మరోవైపు గురువారం మధ్యాహ్నాం వరకు బీచ్ లు,పార్క్ లు వంటి పబ్లిక్ ప్లేస్ లలో ప్రజల కదలికపై నిషేధం విధించింది ప్రభుత్వం.

మరోవైపు ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో నిలిపివేయబడిన విమానరాకపోకలు తిరిగి పునరుద్దరించబడ్డాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే దేశం ఎదుర్కొంటున్న రెండో తుపాన్‌ ఇది. నిసర్గ తుఫాన్ వాతావరణ శాఖ (IMD) అంచనా వేసినట్టుగానే ఇవాళ మధ్యాహ్నం 12.30- 2.30 గంటల మధ్యలో అలీబాగ్‌కి సమీపంలో తీరాన్ని తాకింది. దాని ప్రభావమే ముంబైపై కొంత వరకు తగ్గడానికి ఓ కారణమైందని వాతావరణ శాఖ అభిప్రాయపడింది.

తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలజడితో తీర ప్రాంతాల్లో పలు చోట్ల అలలు 15-20 అడుగుల ఎత్తువరకు ఎగిసిపడుతున్నాయి. నిసర్గ తుఫాను తాకిడికి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల తీర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. దక్షిణ గుజరాత్‌లోనూ తుఫాన్ ప్రభావం అధికంగానే ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గుజరాత్‌లోని ద్వారక పుణ్యక్షేత్రం వద్ద తుఫాన్ తాకిడికి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.