Cyber Crime: లిక్కర్ డోర్ డెలివరీ.. రూ1.6 లక్షలు పోగొట్టుకున్న మహిళ!

మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు, లిక్కర్ డోర్ డెలివరీ లేకపోగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో ఇప్పటికే అమల్లో ఉంది. అయితే.. ఇదే అదనుగా సైబర్ క్రైమ్ నేరగాళ్లు లిక్కర్ డోర్ డెలివరీ ఆర్డర్ చేసే వారిని టార్గెట్ చేస్తున్నారు.

Cyber Crime: లిక్కర్ డోర్ డెలివరీ.. రూ1.6 లక్షలు పోగొట్టుకున్న మహిళ!

Cyber Crime

Cyber Crime: మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు, లిక్కర్ డోర్ డెలివరీ లేకపోగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో ఇప్పటికే అమల్లో ఉంది. అయితే.. ఇదే అదనుగా సైబర్ క్రైమ్ నేరగాళ్లు లిక్కర్ డోర్ డెలివరీ ఆర్డర్ చేసే వారిని టార్గెట్ చేస్తున్నారు. అలా ఓ మహిళ లిక్కర్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేద్దామని ప్రయత్నించి ఏకంగా లక్షా అరవై వేల రూపాయలను పోగొట్టుకుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఈ ఘరానా మోసం జరిగింది.

ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ 29 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి మలాడ్ (వెస్ట్)లో ఉంటుంది. జూలై 14 రాత్రి 7 గంటల సమయంలో ఈ జంట స్థానిక లిక్కర్ దుకాణం నుండి మద్యం ఆర్డర్ చేయాలని నిర్ణయించుకుని.. ఆన్‌లైన్‌లో మద్యం షాపు నెంబర్ కోసం ప్రయత్నించగా.. మద్యం షాపు ఉద్యోగిగా నటిస్తున్న సైబర్ మోసగాడు ఆమెను బురిడీ కొట్టించి రూ.1.6 లక్షలను బదిలీ చేసుకున్నాడు.

బాధితురాలు మోసం గురించి ఇలా చెప్పారు. చిన్చోలి వైన్ షాప్ నుండి బ్లెండర్స్ ప్రైడ్ ను ఆర్డర్ చేయమని నా భర్త నన్ను కోరాడు. నేను గూగుల్‌లో దాని నంబర్ కోసం వెతికి ఓ నెంబర్ కు కాల్ చేయగా.. వైన్ షాపు ఉద్యోగిగా నటిస్తూ ఒక మోసగాడు నన్ను రూ.1,700 చెల్లించమని అడిగాడు. నేను ఆ డబ్బు చెల్లించగా.. వాట్సాప్‌లో ఓ క్యూఆర్ కోడ్‌ను పంపి జిఎస్‌టి చెల్లింపుకు ఇది అవసరమని.. స్కాన్ చేయమని కోరాడు. నేను కోడ్ స్కాన్ చేయగా నా ఖాతా నుండి రూ.19,860 డెబిట్ అయ్యిందని ఆమె పేర్కొన్నారు.

దీంతో ఆమె ఆ మోసగాడికి కాల్ చేసి మాట్లాడగా.. అది పొరపాటున జరిగిందని, మరొక క్యూఆర్ కోడ్ పంపి స్కాన్ చేస్తే డబ్బులు తిరిగి వస్తాయని చెప్పాడు. అలా చేయడంతో ఆమె ఖాతాకు రూ.10 జమ చేయబడగా.. మోసగాడు మరో క్యూఆర్ కోడ్ పంపి స్కాన్ చేయమనగా ఈసారి ఆమె ఖాతా నుండి రూ.81,200 డెబిట్ అయ్యాయి. ఆ మోసగాడు తన ఖాతాలో సాంకేతిక సమస్యలతో ఇలా జరిగిందని.. మీ డబ్బు తిరిగి చెల్లించేందుకు మరొక బ్యాంక్ ఖాతాను చెప్పాలని కోరడంతో ఆమె తన భర్త బ్యాంకు ఖాతా నెంబర్ ఇచ్చింది.

దీంతో మరొక క్యూఆర్ కోడ్‌ను పంపిన ఆ వ్యక్తి మరోసారి స్కాన్ చేయమని కోరడంతో ఆమె అదే పనిచేసింది. అంతే మరో రూ.79,460 ఖాతా నుండి మాయమయ్యాయి. దీంతో అతను కాల్ చేసి మద్యం డెలివరీ కోసం వచ్చే వ్యక్తి మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తారని చెప్పగా.. ఆ తర్వాత ఎవరూ రాలేదు. చివరికి మోసపోయానని అర్ధం చేసుకున్న ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.