పెళ్లి కోసం హిందువుగా మారిన ముస్లిం యువకుడు…పోలీసు భద్రతలో దంపతులు

  • Published By: venkaiahnaidu ,Published On : December 1, 2020 / 08:45 PM IST
పెళ్లి కోసం హిందువుగా మారిన ముస్లిం యువకుడు…పోలీసు భద్రతలో దంపతులు

Muslim man converts to Hinduism హర్యానా రాష్ట్రంలో నవంబర్-9,2020న 19ఏళ్ల హిందూ యువతిని పెళ్లి చేసుకునేందుకు 21ఏళ్ల ముస్లిం యువకుడు మతం మారిన విషయం తెలిసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళను వివాహం చేసుకున్నాడు. హిందూయిజంలోకి మారిన అతడు తన పేరుని కూడా మార్చుకున్నాడు.



అయితే, ప్రస్తుతం నూతన వధూవరులు హర్యానా పోలీసుల రక్షణలో ఉన్నారు. యువతి కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని,వ్యక్తిగత స్వేచ్ఛకు హాని ఉందని పేర్కొంటూ ఈ జంట పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుని ఆశ్రయించారు. తమ వివాహాన్ని వ్యతిరేకించడం..రాజ్యాంగంలోని ఆర్టికల్-21కింద తమకు కల్పించబడిన హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఈ జంట పేర్కొంది. కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ జంటకి హర్యానా పోలీసులు రక్షణ కల్పించారు.



అయితే, వివాహం తర్వాత కొన్ని రోజులు ఈ జంటని ప్రొటెక్షన్ హోమ్ లో కూడా ఉంచారు పోలీసులు. అంతేకాకుండా యువతి కుటుంబసభ్యులను కూడా పోలీసులు కలిశారు. చట్టబద్దంగా జరిగిన వారి వివాహాన్ని అంగీకరించాల్సిందిగా యువతి కుటుంబసభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశారు. నూతన వధూవరులు తమకు ఇష్టం వచ్చినట్లు జీవించేలా అనుమతించాలని యువతి కుటుంబసభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశారు.



కాగా,అంతకుముందు యువతి తన కుటుంబసభ్యులను కలిసేందుకు నిరాకరించింది. అయితే,నవంబర్-11న కేసు విచారణ సందర్భంగా ఒకే ఒక్కసారి తన కుటుంబసభ్యులను కలిసేందేకు అంగీకరిస్తున్నట్లు యువతి పేర్కొంది.



మరోవైపు, వివాహం కోసం మత మార్పిడి విధానం “లవ్ జీహాద్”ని వ్యతిరేకిస్తూ ఓ చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన పలు బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో హర్యానా కూడా ఉన్న విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో మ‌తాంత‌ర వివాహాలు జ‌రుగుతున్నాయ‌ని, హిందూ మ‌తానికి చెందిన అమ్మాయిల‌ను..ముస్లింలు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేసుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో లవ్ జీహాద్ కి వ్యతిరేకంగా ఓ చట్టం సిద్దం చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని హర్యానా ప్రభుత్వం ఏర్పాటుచేసినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజి గత వారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి ఇప్పటికే లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా ఓ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.