నన్ను కొనేవాడు ఇంకా పుట్టలేదు…ముస్లిం ఓటర్లు మమత జాగీరు కాదు : ఓవైసీ

నన్ను కొనేవాడు ఇంకా పుట్టలేదు…ముస్లిం ఓటర్లు మమత జాగీరు కాదు : ఓవైసీ

Muslim voters not your jagir వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముస్లింలను విభజించడానికి కోట్లు ఖర్చు పెట్టి బీజేపీ..హైదరాబాద్‌ నుంచి బెంగాల్ కి ఒక పార్టీని తీసుకొచ్చిందని, బీహార్‌లో జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనమంటూ సోమవారం బెంగాల్‌ రాష్ట్రంలోని జల్ పాయ్ గురి లో జరిగిన ఓ సభలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో స్పందించారు. మమత వ్యాఖ్యలు నిరాధారమైనవని ఖండించారు.

కాగా ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించడంతో.. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో జరుగనున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, సోమవారం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఓవైసీ…తనను డబ్బుతో కొనే మనిషి ఇంకా పుట్టలేదని అసదుద్దీన్‌ స్పష్టం చేశారు. ఇప్పటివరకు మీరు మీకు విధేయులైన మీర్ జాఫర్స్, సాదిక్‌లతో మాత్రమే వ్యవహరించారు. తమ గురించి ఆలోచించే, మాట్లాడే ముస్లింలను మీరు ఇష్టపడరు. బీహార్‌లోని మా ఓటర్లను మీరు అవమానించారు. ముస్లిం ఓటర్లు మీ జాగీర్ కాదు అని తృణమూల్ చీఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒవైసీ ట్వీట్ చేశారు.

గతంలో పార్టీలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఓటు కట్టర్లు అని ఆరోపిస్తే.. ఎలాంటి ఫలితాలు వచ్చాయో గుర్తు పెట్టుకోవాలన్నారు. ముస్లిం ఓట్లు మమత జాగిరు, ఆస్తులు కాదని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కు చెందిన నేతలు బీజేపీలో చేరుతున్నారని, దీంతో పార్టీ ఫిరాయింపులపై ఆమె ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రంలోనే ఆమె భయపడుతున్నారని తెలిపారు.

కాగా,బెంగాల్ లోని ముస్లింల సంఖ్య ప్రభావితంగా ఉన్న ముర్షిదాబాద్,నార్త్ దినంజ్ పూర్ వంటి జిల్లాల్లో ఎంఐఎం పార్టీ చాలా యాక్టివ్ గా ఉంది. 54 సీట్లు ఉన్న నార్త్ బెంగాల్ లో ఎక్కువసీట్లు సాధించే సత్తా తమకు ఉందని ఎంఐఎం లీడర్లు విశ్వాసం వ్యక్తం చేశారు. నార్త్ బెంగాల్ లో దాదాపు 10 నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది. మరోవైపు, వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కూడా ఎంఐఎం రెడీ అయింది.