Muslim women right say talaq : తలాఖ్​ చెప్పే హక్కు ముస్లిం మహిళలకు కూడా ఉంది : కేరళ హైకోర్టు సంచలన తీర్పు..!!

Muslim women right say talaq : తలాఖ్​ చెప్పే హక్కు ముస్లిం మహిళలకు కూడా ఉంది : కేరళ హైకోర్టు సంచలన తీర్పు..!!

Muslim Women Have Right To Invoke Extra Judicial Divorce

Muslim Women Have Right To Invoke Extra Judicial Divorce : తలాఖ్..తలాఖ్…తలాఖ్ అని మూడు ముక్కలు చెప్పేస్తే..విడాకులు అయిపోయినట్లేనంటుంది ముస్లిం సామాజిక వర్గంలోని రూల్. కానీ మహిళలకు ఇష్టమున్నా లేకపోయినా భర్తతోనే ఉండాలి. ఈ విషయంలో ముస్లిం మహిళలకు కేరళ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. తలాఖ్ చెప్పే హక్కు ముస్లిం మహిళలకు కూడా ఉందని తీర్పునిచ్చింది. విడాకులు తీసుకోవాలనుకునే మహిళలు కోర్టుకు రావాల్సిన పనిలేదని..కోర్టు బయటే ‘నాలుగు పద్ధతుల్లో’ విడాకులు తీసుకోవచ్చని తీర్పునిచ్చింది.

ముస్లిం మహిళలూ కోర్టుకు రావాల్సిన పనిలేకుండానే ఇస్లాం చట్టాల ప్రకారం విడాకులు తీసుకోవచ్చని తీర్పు చెప్పింది. ఫ్యామిలీ కోర్టుల్లో పరిష్కారం కాని వివిధ కేసుల విచారణ చేస్తున్న సందర్భంగా ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. కోర్టుకు రాకుండా విడాకులు తీసుకునే హక్కు ముస్లిం మహిళలకు లేదని 1972లో ‘కేసీ మోయిన్ వర్సెస్ నఫీసా తదితరులు’ కేసులో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

ఈ సందర్భంగా జస్టిస్ ఎ. మహ్మద్ ముస్తాఖ్, జస్టిస్ సీఎస్ దియాస్ ల ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లింలకు పరమ పవిత్రమైన ఖురాన్ ముస్లిం పురుషులు, మహిళలకు విడాకులు తీసుకునే విషయంలో సమాన హక్కులను కల్పించిందని తెలిపింది. షరియా చట్టం పరిరక్షణలోని ఇస్లాం చట్టాలు గుర్తించిన తలాఖ్ ఈ తాఫీజ్, ఖులా, ముబారాత్, ఫస్క్ అనే నాలుగు పద్ధతుల విడాకులను ప్రస్తావించింది ధర్మాసనం. వాటిలోని మూడు పద్ధతుల ప్రకారం ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చని తీర్పునిచ్చింది.

మూడు పద్ధతుల్లో తలాఖ్ : Khula, Mubara’at and Faskh
అంతేకాదు ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావిస్తూ..‘‘షరియా చట్టం, ముస్లిం వివాహాల రద్దు చట్టాలను ధర్మాసనం పరిశీలించిందని వెల్లడించారు న్యాయమూర్తులు. ముస్లిం మహిళలు కోర్టుకు రాకుండా ‘ఫస్క్’ పద్ధతిలో విడాకులు తీసుకోవడాన్ని ముస్లిం వివాహాల రద్దు చట్టం నిరోధిస్తోంది. కాగా..షరియా చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం అన్ని పద్ధతుల్లో ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చు. కాబట్టి, కేసీ మోయిన్ కేసులో నాటి ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం’’ అని పేర్కొంది.

మూడు రకాల విడాకుల పద్ధతుల్లోని తంతు ఇలా..
వివాహం చేసుకున్నప్పుడు చేసుకున్న ఒప్పందాన్ని..తీసుకున్న నిర్ణయాలను పాటించని భర్తకు భార్య తలాఖ్ ఈ తాఫీజ్ ద్వారా విడాకులు ఇవ్వొచ్చు. ఖులా ప్రకారం భార్యే ఏకపక్షంగా భర్త నుంచి విడాకులు తీసుకోవచ్చు. పరస్పర ఆమోదంతో ముబారాత్ ద్వారా భర్త నుంచి భార్య విడిపోవచ్చు. ‘ఖాజీ’ అనే మధ్యవర్తుల ద్వారా ఫస్క్ పద్ధతిలో విడాకులను పొందవచ్చు.