PM’s Vaccine Hesitancy Message : వ్యాక్సిన్ పై భయాలు వద్దు..100ఏళ్ల మా అమ్మ కూడా టీకా తీసుకుంది

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

PM’s Vaccine Hesitancy Message : వ్యాక్సిన్ పై భయాలు వద్దు..100ఏళ్ల మా అమ్మ కూడా టీకా తీసుకుంది

Pm

PM’s Vaccine Hesitancy Message దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి..భారత్ చరిత్ర సృష్టించిందని మోదీ తెలిపారు. అయితే ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా ఇంకా కొంతమంది వ్యాక్సిన్ తీసుకునేందుకు భయపడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ కీలక సందేశమిచ్చారు.

ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ పై నెలకొన్న భయాలు,ఆందోళనలు వీడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అందరూ సైన్స్ ని నమ్మాలని..మన శాస్త్రవేత్తలను నమ్మాలని మోదీ తెలిపారు. చాలా మంది ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు. తనతో పాటు దాదాపు 100 ఏళ్ల వయస్సు ఉన్న తన తల్లి కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. వ్యాక్సిన్ వేయించుకుంటే కొంద‌రికి కొన్ని గంటల పాటు సాధార‌ణ జ్వ‌రం రావ‌చ్చ‌ని, అనంత‌రం అది కూడా ఉండ‌ద‌ని మోదీ చెప్పారు. క‌రోనా వ్యాక్సిన్‌ను తిర‌స్క‌రించ‌డం చాలా ప్ర‌మాదక‌ర‌మ‌ని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారానే ప్రాణాంతక వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోగలమన్నారు. నూటికి నూరు శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్న గ్రామాలు మన దేశంలో చాలా ఉన్నట్లు తెలిపారు

వదంతులను ప్రచారం చేసేవారిని చెయ్యనివ్వండని చెప్తూ, మనమంతా కలిసికట్టుగా ఉంటూ మన పని మనం చేద్దామని, మన చుట్టూ ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకునేలా కృషి చేద్దామని మోదీ తెలిపారు. కోవిడ్-19 ముప్పు ఇంకా పొంచి ఉందని.. ప్రజలు వ్యాక్సినేషన్‌పైనా, కరోనా వైరస్ నిరోధక మార్గదర్శకాలను పాటించడంపైనా దృష్టి సారించాలని మధ్యప్రదేశ్ లోని బెతూల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వారితో మాట్లాడుతూ మోదీ అన్నారు. వదంతులను నమ్మవద్దని వారికి నచ్చజెప్పారు. కాగా,దేశంలోని సగం జనాభాకి ఇంకా వ్యాక్సినేషన్ జరగలేదు. ఈ సమయంలో డెల్టా ఫ్లస్ వంటి కొత్త కోవిడ్ వేరియంట్లపై ఆందోళన వ్యక్తం అవుతున్న క్రమంలోనే ప్రధాని మోదీ కీలక సందేశమిచ్చారు. దేశంలోని పెద్దల జనాభాలో.. కేవలం 5.6శాతం మంది రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇక,టోక్యో ఒలింపిక్స్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ క్రీడల గురించి మ‌నం మాట్లాడుకుంటున్నామ‌ని మన్ కీ బాత్ లో మోదీ చెప్పారు. ఈ స‌మ‌యంలో అథ్లెట్ మిల్కా సింగ్‌ను గుర్తు చేసుకోకుండా ఉండ‌లేమ‌ని తెలిపారు. కొవిడ్‌పై పోరాడుతూ మిల్కా సింగ్ ప్రాణాలు కోల్పోయార‌ని, దీంతో దేశం ఆయ‌న‌ను కోల్పోయింద‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న ఆసుప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో తాను ఆయ‌న‌తో మాట్లాడాన‌ని మోదీ చెప్పారు. 1964 టోక్యో ఒలింపిక్స్ గురించి ప్ర‌స్తావించాన‌ని తెలిపారు. క్రీడ‌ల‌కే త‌న జీవితాన్ని అంకితమిస్తూ మిల్కా స్ఫూర్తిదాయ‌కంగా నిలిచార‌ని కొనియాడారు.