మైసూర్ జూకు చేరుకున్న దక్షిణాఫ్రికా చిరుతలు

  • Published By: venkaiahnaidu ,Published On : August 19, 2020 / 10:01 PM IST
మైసూర్ జూకు చేరుకున్న దక్షిణాఫ్రికా చిరుతలు

ద‌క్షిణాఫ్రికాలోని ఆన్ వాన్ డైక్ చిరుతల‌ కేంద్రం నుంచి మైసూర్‌లోని శ్రీ చామ‌రాజేంద్ర జూలాజిక‌ల్ గార్డెన్‌కు మూడు చిరుత‌లు చేరుకున్నాయి. వీటిలో ఒక‌టి మ‌గ‌ది కాగా మ‌రో రెండు ఆడ చిరుత‌లు. 14 నుంచి 16 నెల‌ల వ‌య‌స్సున్న ఈ మూడు చిరుత పులులు సోమ‌వారం నాడే జూకు చేరుకున్న‌ట్లు అధికారి ఒక‌రు తెలిపారు.



జంతు మార్పిడి కార్య‌క్ర‌మంలో భాగంగా జోహ‌న్నస్‌బ‌ర్గ్ నుంచి వాయుమార్గంలో ఇవి బెంగ‌ళూరుకు చేరుకున్న‌ట్లు మైసూర్ జూ డైరెక్ట‌ర్ అజిత్ కుల‌క‌ర్ణి తెలిపారు.హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ తరువాత చిరుతలను క‌లిగి ఉన్న రెండవ జంతుప్రదర్శనశాల త‌మ‌దన్నారు. సెప్టెంబ‌ర్ నుంచి సంద‌ర్శ‌కుల‌కు ఆఫ్రికా చిరుత‌ల‌ను చూసేందుకు అనుమ‌తివ్వ‌నున్న‌ట్లు కుల‌క‌ర్ణి తెలిపారు.

త‌మ వ‌ద్ద‌ 2011లో జర్మనీ నుండి తెచ్చిన నాలుగు చిరుత పులులు ఉన్న‌ప్ప‌టికీ ఓ చిరుత 2019లో మ‌ర‌ణించింద‌న్నారు. వీటి ఆయుర్థాయం అతి త‌క్కువ‌గా 12 నుంచి 14 సంవత్సరాలు మాత్ర‌మేన‌న్నారు. భూమిపై గంటకు సగటున 100 కిలోమీటర్ల వేగంతో ప‌రిగెత్తే జంతువు చిరుత‌పులి అన్నారు.



మూడు చిరుతలు ఇక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అల‌వాటు ప‌డేంత‌వ‌ర‌కు ఎన్‌క్లోజ‌ర్‌లో ఉంటాయ‌న్నారు. అనంత‌రం 7 వేల చ‌ద‌ర‌పు మీట‌ర్ల కంచెను క‌లిగిన స్థ‌లంలో తిరుగుతాయ‌న్నారు.